
దేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. ఈ ప్రాంతం అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులకు నెలవుగా ఉంది.
ఇక ఉత్తరాఖండ్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందుకే ఉత్తరాఖండ్ ను మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తుంటారు. అలాగే ఈ ప్రదేశంలో ఎన్నో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని దేవభూమిగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడి ఛార్ ధామ్ యాత్ర, హరిద్వార్ అండ్ రిషికేష్, పంచ్ కేదార్ అండ్ పంచ్ బద్రి ఉన్నాయి.అలాగే ప్రముఖ హిల్ స్టేషన్స్ అయిన ముస్సోరీ, నైనితాల్, ఔలి, అల్మోరా అండ్ రాణిఖేత్ లాంటి ప్రాంతాలను సందర్శించేందుకు నిత్యం వేలాదిగా పర్యటకులు తరలివస్తుంటారు. అయితే ఉత్తరాఖండ్ లోని ఎత్తయిన కొండలు, లోయల మధ్య దాగి ఉన్న మరో ప్రదేశం హర్సిల్ వ్యాలీ.. సిమ్లా, మనాలి పర్యటక ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. దట్టమైన మంచు కొండలు, అడవుల మధ్య ఈ వ్యాలీ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి నిశ్శబ్ద వాతావరణం ముఖ్యంగా నగర వాసులకు మరచిపోలేని అనుభూతి.ఇక హర్సిల్ లోయ అంతటా సంప్రదాయ హిమాలయ గ్రామాలు, చెక్కతో నిర్మించిన పాత ఇళ్లు అలాగే సుందరమైన నడక మార్గాలు, యాపిల్ తోటలు కనువిందు చేస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కూడా అద్భుతమైన సమయం అని ప్రకృతి ప్రేమికులు చెబుతారు.మరి హర్సిల్ వ్యాలీకి ఎలా చేరుకోవాలి..? ఈ ప్రాంతానికి సమీప ఎయిర్ పోర్ట్ జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్.. అక్కడి నుంచి హర్సిల్ సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు అయితే సమీప ప్రధాన రైల్వే స్టేషన్ రిషికేష్‌. అలాగే దేశంలోని అనేక ప్రధాన నగరాలతో దీనికి రైలు అనుసంధానం ఉంది. ఇక ఉత్త‌ర‌కాశీ నుంచి సుమారు 75 కిలోమీటర్లు ఉంటుంది. మరోవైపు గంగోత్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం.తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి అంటే.. హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ నుంచి జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ కు విమానంలో ప్రయాణించాలి. అక్కడి నుంచి ప్రైవేట్ ట్యాక్సీ లేదా బస్సు ద్వారా హర్సిల్ వ్యాలీకు చేరుకోవచ్చు. రైలు ప్రయాణం అయితే సికింద్రాబాద్ లేదా వైజాగ్ నుంచి నేరుగా దిల్లీ లేదా హరిద్వార్ చేరుకోవాలి. అక్కడి నుంచి రిషికేశ్ కు బస్సులు లేదా జీపుల ద్వారా ప్రయాణం సాగించవచ్చు. రిషికేశ్ నుంచి హర్సిల్ వ్యాలీకి దాదాపు 230 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ రోడ్డు కాబట్టి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. ఇక రోడ్డు ప్రయాణం అయితే డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ, ధరసు బెండ్, ఉత్తరకాశీ, భట్వారీ, హర్సిల్ వ్యాలీకు చేరుకోవచ్చు.