
బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి, అధికార లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
తన అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. వీడ్కోలు ప్రసంగంలో భావోద్వేగానికి గురయ్యారు. దేశ ప్రధానిగా పనిచేయడం తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు.తన హయాంలో బ్రిటన్ అంతర్జాతీయ ఖ్యాతి నిలబడిందని, పెట్టుబడులు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రజల, సహచరుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ తాను తప్పుకుంటున్నట్లు, తద్వారా శాంతియుత అధికార బదిలీకి మార్గం సుగమం చేస్తున్నట్లు తెలిపారు. స్టార్మర్ వైదొలగడంతో బ్రిటన్‌లో ఒక కీలక ఘట్టం ముగిసింది. కొంతకాలంగా సొంత పార్టీలోనే నిరసన జ్వాలలు ఎగిసిపడటం, దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వంపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఆయన తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని చారిత్రాత్మక విజయపథంలో నడిపించి, భారీ మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన కీర్ స్టార్మర్.. రెండేళ్లు కూడా పూర్తికాకముందే పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో లేబర్ పార్టీ చవిచూసిన ఘోర పరాజయం స్టార్మర్ నాయకత్వ వైఫల్యాలను బయటపెట్టింది.ప్రభుత్వ ఆర్థిక పథకాలు, వివాదాస్పద సంక్షేమ సంస్కరణల పట్ల పార్టీ సభ్యుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. లేబర్ పార్టీ సీనియర్ నేత, గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికలలో ఘనవిజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టడంతో ప్రధాని మార్పు డిమాండ్ ఊపందుకుంది. స్టార్మర్ స్థానంలో బర్న్‌హామ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెడితేనే రానున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధించగలమని పలువురు ఎంపీలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు.బర్న్‌హామ్ రాకతో స్టార్మర్ పదవికి ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు ముందే ఊహించారు కూడా. బ్రిటన్ నూతన ప్రధాని రేసులో ఆండీ బర్న్‌హామ్ ఉన్నారు. కీర్ స్మార్మర్ వారసుడిగా ఆయన ఎంపిక కావడం లాంఛనప్రాయమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజా మద్దతు కోల్పోవడం కూడా స్టార్మర్ రాజీనామాకు దారితీసింది. ఇటీవల విడుదలైన ఇప్సాస్ పోల్ సర్వే ప్రకారం బ్రిటన్ ప్రజలలో సుమారు 52 శాతం మంది స్టార్మర్ తక్షణమే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. 35 శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.వివాదాస్పద నేత పీటర్ మాండెల్సన్‌ను అమెరికా ప్రతినిధిగా నియమించడం వంటి నిర్ణయాలు సొంత సహచరులలో తీవ్ర కలకలం రేపాయి. ప్రధాని రాజీనామా ప్రకటనతో బ్రిటన్ ఆర్థిక రంగంలో అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ 0.19 శాతం పతనమై 1.3207 వద్ద ట్రేడ్ అయింది. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి మాత్రం 4.8452 శాతం వద్దే స్థిరంగా కొనసాగుతోంది.దశాబ్ద కాలంలో ఆరుగురు ప్రధానుల నిష్క్రమణ..కీర్ స్టార్మర్ నిష్క్రమణతో బ్రిటన్ రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలిచాయి. బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగి సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ తాజా సంక్షోభం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దశాబ్ద కాలంలో బ్రిటన్‌లో పదవీకాలం పూర్తికాకుండానే తప్పుకున్న ఆరో ప్రధానిగా స్టార్మర్ నిలిచారు. అంతకుముందు డేవిడ్ కామెరూన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్ వంటి నేతలు కూడా ఇలాగే మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది.ప్రస్తుతం స్టార్మర్ వారసుడిగా లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ రేసులో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసి, ఇటీవల ఉప ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న ఆండీ బర్న్‌హామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ కూడా ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.