
పిల్లలు అడిగిన ప్రతిదాన్ని వెంటనే కొనిపెట్టడం లేదా వారి ప్రతి కోరికను తీర్చడం ప్రేమకు గుర్తుగా చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు మంచిది కాదు.
పిల్లల ప్రతి కోరికను ఎందుకు తీర్చకూడదు? దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే వారు అడిగిన ప్రతి వస్తువును, ప్రతి కోరికను వెంటనే నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. బొమ్మలు, ఖరీదైన దుస్తులు లేదా బయట తినాలన్న కోరిక.. ఏదైనా సరే పిల్లలు అడిగితే కాదనలేక చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. అయితే పిల్లల ప్రతి కోరికను తీర్చడం ఎప్పుడూ మంచి పెంపకానికి సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, భవిష్యత్తుపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పిల్లలకు కావాల్సిన ప్రతిదీ వెంటనే లభిస్తే, వారు ఎదురుచూడటం నేర్చుకోరు. ఏది కావాలన్నా వెంటనే దొరకాలని భావిస్తారు. ఫలితంగా, చిన్న విషయాల్లో కూడా అసహనం, కోపం పెరిగే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రతిసారి మనకు అనుకూల పరిస్థితులు ఉండవు కాబట్టి ఓర్పు చాలా అవసరం.
ఏ ప్రయత్నం చేయకుండానే అన్నీ దొరికిపోతే, వాటి వెనుక ఉన్న కష్టం వారికి అర్థం కాదు. ఏదైనా సాధించాలంటే శ్రమ, క్రమశిక్షణ, బాధ్యత అవసరమనే విషయం గ్రహించలేరు. దీంతో బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ధోరణి పెరగవచ్చు.
పిల్లల ప్రతి కోరికను నెరవేర్చడం వల్ల తమ అవసరాలే ముఖ్యమని వారు భావించడం ప్రారంభిస్తారు. దీంతో ఇతరుల భావాలు, అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. కొంతమంది పిల్లల్లో మొండితనం, స్వార్థపూరిత ప్రవర్తన కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
సులభంగా దొరికే వస్తువుల విలువను చాలామంది గుర్తించరు. పిల్లలకు తరచూ కొత్త వస్తువులు కొనిపెడితే, వాటి ప్రాముఖ్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. దీంతో ఎప్పుడూ కొత్తదే కావాలనే అలవాటు పెరిగి, ఉన్నదానితో సంతృప్తి చెందలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
పిల్లల ప్రతి కోరికను తీర్చడం కంటే, మంచి-చెడులను అర్థం చేసుకునేలా వారిని తీర్చిదిద్దడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు 'కాదు' అని చెప్పడం, ఎదురు చూడటం, కష్టపడటం, బాధ్యతలను నిర్వర్తించడం వంటి విలువలను నేర్పించడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రేమతో కూడిన క్రమశిక్షణ, సరైన హద్దులు పెట్టడం మంచి పెంపకానికి ప్రధాన లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు.
ఆకలి లేకపోయినా తింటున్నారా? ఇది తెలుసుకోండి
మీరు వాడే కారం పొడి కల్తీదో కాదో ఇలా గుర్తించండి