
భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంత నీటిపై తమకున్న హక్కులకు భంగం కలిగితే, సైనిక చర్యకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న జలాల ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత ఇరు దేశాల మధ్య నూతనఉద్రిక్తతలకు కారణమవుతోంది.జాతీయ భద్రతా అంశం..ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. 2028 జూన్ నాటికి పాకిస్తాన్ కు వెళ్లే సింధు నదీ జలాలను పూర్తిగా నిలిపివేయవచ్చని జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సింధు నదీ జలాల వ్యవహారాన్ని తమ దేశ మనుగడకు సంబంధించిన జాతీయ భద్రతా అంశంగా అభివర్ణించారు. జలాల ప్రవాహాన్ని నియంత్రించడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యం..పాకిస్తాన్ తో 1960లో కుదిరిన చారిత్రక సింధు జలాల ఒప్పందాన్ని.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. నాటి దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపనంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్రం ఖరాకండిగా చెప్పింది. అప్పటి నుంచి ఈ ఒప్పందం నిలిచిపోయింది.విపరీతమైన నీటి కొరత..ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని దాదాపు 80 శాతం నీటి వాటాను పాకిస్తాన్ కు కేటాయించారు. వ్యవసాయం, సాగునీటితో పాటు పాక్ ఆర్థిక జీవనాడి అంతా ఈ నదీ పరివాహకంపైనే ఆధారపడి ఉంది. ఒకవైపు దేశంలో విపరీతమైన నీటి కొరత, పారిశ్రామిక సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో ఈ కీలక జలాల ప్రవాహం గనుక ఆగిపోతే తమ దేశ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది.అంతర్జాతీయ వేదికలపై..ఈ జలాల వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల పాక్ డిప్యూటీ ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర జోక్యాన్ని కోరారు. చినాబ్ నది నుంచి నీటి ప్రవాహాన్ని మళ్లించే లక్ష్యంతో భారత్ కొత్తగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టు తమ దేశ సార్వభౌమత్వాన్ని, నీటి హక్కులను కాలరాయడమేనని ఆరోపించారు.నలిగిపోతున్న పాక్..తీవ్ర వాతావరణ మార్పులు, మంచినీటి సంక్షోభాల నడుమ నలిగిపోతున్న పాకిస్తాన్ కు ఈ జలాల వివాదం సవాలుగా పరిణమించింది. సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా జలాల రక్షణ పేరుతో భారత్‌ను యుద్ధానికి రమ్మని హెచ్చరించడం ద్వైపాక్షిక సంబంధాలను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశముంది. అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగు దేశాల మధ్య సింధు జలాల అంశం ఇప్పుడు అత్యంత సున్నిత, ప్రమాదకర వివాదంగా మారింది.