
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టు వంటి ఖతార్ రస్ లఫాన్ క్షేత్రంలో బర్జాన్ ప్లాంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది గాయపడగా.. 18 జాడ గల్లంతైంది
. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
వాస్తవానికి ఇరాన్-అమెరికా యుద్ధం వేళ ఐఆర్జీసీ దళాలు ఈ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకొని భారీగా దాడులు చేశాయి. దీంతో గ్యాస్ ప్లాంట్ దెబ్బతిని భారీగా ఉత్పత్తి సామర్థ్యం పడిపోయింది. కొన్నాళ్ల క్రితమే ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గు ముఖం పట్టడంతో గ్యాస్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ఖతార్ చర్యలు చేపట్టింది.
ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో రస్ లఫాన్ నగరం ఉంది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో ఇది ఆసియా, ఐరోపా ఎగుమతులకు అత్యంత అనువైన ప్రదేశం. ఇక్కడి నుంచి గ్యాస్ దాదాపు 30 దేశాలకు పైగా ఎగుమతి అవుతోంది. వీటిల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమాఖ్య, చైనా వంటి దేశాలు ఉన్నాయి.
భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతార్ నుంచి 40-47% వరకు హర్మూజ్ జలసంధి దాటుకొని వస్తున్నాయి. ఈ గ్యాస్ క్షేత్రాన్ని ఖతార్ ఎనర్జీనే నిర్వహిస్తుంది. భారత్-ఖతార్ మధ్య 2024లో 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2028 నుంచి 20 ఏళ్లపాటు ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఖతార్ ఎల్ఎన్జీ భారత్లో విద్యుత్తు, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమలు, గృహోపయోగానికి చాలా కీలకం. అమెరికా, ఆఫ్రికాతో పోల్చుకొంటే ఇక్కడి నుంచి భారత్కు గ్యాస్ తరలించడం చాలా చౌక.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.