
భూగోళంపై జీవవైవిధ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని శాసిస్తున్న ఉష్ణమండల వర్షారణ్యాల పరిరక్షణే ధ్యేయంగా నేడు (జూన్ 22) 'ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం' నిర్వహిస్తున్నారు.
'రెయిన్‌ఫారెస్ట్ పార్ట్నర్షిప్' అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో 2017లో ప్రారంభమైన ఈ దినోత్సవం.. ఈ ఏడాది ‘ద ఫారెస్ట్ వితిన్ యూ’ (మీలోని అడవి) అనే ప్రత్యేక థీమ్‌తో అంతర్జాతీయంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. కేవలం కార్బన్‌ను గ్రహించడమే కాకుండా, భూమిపై కురిసే వర్షాలలో మెజారిటీ శాతాన్ని ఈ అడవులే ఉత్పత్తి చేస్తున్నాయనే శాస్త్రీయ నిజాన్ని ఈ ఏడాది ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఫోటో గ్యాలరీ ఫీచర్ (8 స్లైడ్స్) ద్వారా వర్షారణ్యాలు అంతరిస్తే మానవాళి మనుగడకు అవసరమైన తాగునీటి వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో వివరించే ప్రయత్నం చేశారు.శాస్త్రీయ కోణంలో చూస్తే.. ఈ అడవుల్లోని చెట్లు తమ వేర్ల ద్వారా భూగర్భ జలాలను పీల్చుకుని, ఆపై పత్రరంధ్రాల ద్వారా భారీ మొత్తంలో నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీనినే 'ట్రాన్స్పిరేషన్' (బాష్పోత్సేకం) అంటారు. అడవిలోని ఒకే ఒక్క పెద్ద చెట్టు రోజుకు దాదాపు 100 గ్యాలన్ల (378 లీటర్లు) నీటి ఆవిరిని ఆకాశంలోకి పంపుతుంది. ఈ తేమ అంతా కలిసి ఆకాశంలో దట్టమైన మేఘాలుగా మారి, ఖండాల మీదుగా ప్రయాణించే ‘వాతావరణ నదులు’(Atmospheric Rivers)గా రూపాంతరం చెందుతాయి. ఉదాహరణకు, అమెజాన్ అడవులు ప్రతిరోజూ వాతావరణంలోకి 20 బిలియన్ టన్నుల తేమను విడుదల చేస్తూ దక్షిణ అమెరికాతో పాటు సుదూరంగా ఉన్న అమెరికాలోని టెక్సాస్ ప్రాంత వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి.