స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ రిసార్ట్స్‌లో అమెరికా - ఇరాన్ మధ్య తొలి విడత ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయి. వంద రోజులకు పైగా సాగిన భీకర యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కుదరడం, ఆ వెంటనే చర్చలు...
స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ రిసార్ట్స్‌లో అమెరికా - ఇరాన్ మధ్య తొలి విడత ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయి. వంద రోజులకు పైగా సాగిన భీకర యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కుదరడం, ఆ వెంటనే చర్చలు జరుగుతుండటం ఇరు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు కొంత సానుకూలమైన వాతావరణం అని చెప్పొచ్చు. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్చలను పర్యవేక్షించేందుకు ఓ హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చర్చల ప్రక్రియను రాజకీయ స్థాయిలో పర్యవేస్తుంది. అదేవిధంగా అణు కార్యక్రమం, ఆంక్షలు, పర్యవేక్షణ వ్యవస్థలు, వివాద పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు పనిచేస్తాయి. అంతిమ ఒప్పందాన్ని 60 రోజుల్లో పూర్తి చేయడానికి రోడ్‌మ్యాప్‌కు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. చర్చల సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా హార్మూజ్ జలసంధి భద్రతకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ప్రధాన లక్ష్యం హార్మూజ్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానం చేర్చడం. అదేవిధంగా సముద్ర మార్గంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడటం. తొలి విడత చర్చల్లో ప్రధానంగా లెవనెత్తిన అంశం లెబనాన్‌లో కాల్పుల విరమణ. లెబనాన్‌లో సైనిక చర్యల విరమణను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెల్లో చర్చల్లో పాల్గొంటున్న ఇరుపక్షాలు, లెబనాన్ ప్రభుత్వం కూడా భాగస్వాములుగా ఉండనున్నాయి. దీనికి ఖతార్, పాకిస్థాన్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తాయి. అమెరికా - ఇరాన్ మొదటి విడత సమావేశాలు ముగిసినప్పటికీ చర్చలు ఇంకా కొనసాగనున్నాయి. ముఖ్యంగా అణు ఒప్పందం, ఆంక్షలు, భద్రతా అంశాలపై సాంకేతిక స్థాయి చర్చలు ఈ వారం మొత్తం బర్గెన్‌స్టాక్‌లో కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ చర్చల ప్రధాన ఉద్దేశం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమే.