
సాక్షి, పల్నాడు జిల్లా: తాను ఏ తప్పు చేయలేదని.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్టు చేయించి జైలుకు పంపించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు.
Jun 21 2026 8:38 PM | Updated on Jun 21 2026 8:38 PM
సాక్షి, పల్నాడు జిల్లా: తాను ఏ తప్పు చేయలేదని.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్టు చేయించి జైలుకు పంపించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆయనను నరసరావుపేటలోని స్వగృహంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డిలు బ్రహ్మనాయుడిని పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన బొల్లా బ్రహ్మానాయుడు.. తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అరెస్టు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రెస్మీట్లో బ్రహ్మనాయుడు ఏమన్నారంటే..
నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా? నాపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే. నాకు సంబంధం లేని భూముల వ్యవహారంలో అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారు. నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా? నాపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కంప్లైంట్ నమోదైంది? ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నన్ను తెలంగాణలో అరెస్టు చేయించారు. నా అరెస్టుకు ఐదు రోజుల ముందే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను అరెస్టు చేయిస్తానని బహిరంగంగా చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరిగింది. వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి.
ఢిల్లీలోని ఏ గెస్ట్‌హౌస్‌కు వెళ్లినా కృష్ణదేవరాయులు చరిత్ర చెబుతారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనను తాను చాలా నిజాయితీ పరుడిగా, నిబద్ధత ఉన్న నాయకుడిగా చెప్పుకుంటున్నారు. కానీ నా నిజాయితీ గురించి వినుకొండ ప్రజలను అడిగితే చెబుతారు. ఎంపీ గురించి తెలుసుకోవాలంటే ఢిల్లీలోని ఏ గెస్ట్‌హౌస్‌కు వెళ్లినా ఆయన చరిత్ర గురించి వినిపిస్తారు. నేను మీ కంటే ఆస్తిపరంగా చాలా చిన్నవాడిని.
మీ నాన్న నిర్వహిస్తున్న విజ్ఞాన్ విద్యాసంస్థల్లో ఎంత ప్రభుత్వ భూమి ఉందో ఒకసారి సర్వే చేయించి మీ నిజాయితీని నిరూపించుకోండి. వైయస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచి పదవిని అనుభవించి, ఆ తర్వాత టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ అవకాశాలను ఉపయోగించుకుని వదిలేసింది మీరే. మీలాగా నేను నేరస్తుడిని కాదు. మీ కుటుంబానికి ఇంత ఆస్తి ఉంటే ప్రజలకు మీరు ఎంత పన్నులు చెల్లిస్తున్నారో చెప్పండి.
మీరు ఎంత జీఎస్టీ కట్టారో చూపించగలరా? నేను కోట్ల రూపాయల జీఎస్టీ, ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నాను. అయినా ప్రభుత్వ ఆస్తులను మింగేశానంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే జీవీ అంజనేయులు తరచూ కంపెనీల పేర్లు మారుస్తుంటారు. బయో ఫర్టిలైజర్స్ సంస్థ ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తూ ప్రభుత్వ సబ్సిడీలు పొందుతోంది. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రస్టులు, సొసైటీల పేరుతో పన్ను మినహాయింపులు పొందుతున్నారు.
మీ నాన్న బడిపంతులు కదా ..ఇన్ని ఆస్తులు ఎక్కడివి? హైదరాబాద్, విశాఖలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టింది లావు కృష్ణదేవరాయులు కుటుంబమేనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తప్పులు చేస్తున్నది మీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్నది మీరు. మరో ప్రభుత్వం వస్తే మరో పార్టీలో చేరేది కూడా మీరే. మీ బెదిరింపులకు నేను భయపడను. 70 ఏళ్ల వయసులో నా అంతు చూస్తామంటున్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరి అంతు ఎవరు చూస్తారో దేవుడే నిర్ణయిస్తాడు.
నేను చదువుకోలేదు, రైతును. కానీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పనిచేశాను. వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారు. రెండుసార్లు ఓడిపోయినా ఒకసారి గెలిచి వినుకొండకు సేవ చేశాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎంపీ ఎప్పుడు పిలిచినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. నన్ను ఏమీ చేయలేరు. చివరకు నిజమే గెలుస్తుంది.
అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు నాకు అండగా నిలిచిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కి, మా పార్టీ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు.. చేసిందే చెబుతారు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పరు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇవాళ పేదవాడు ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. రాష్ట్రంలో లాకప్ డెత్‌లు కనిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు ఆపి, ప్రజలకు మంచి చేసే పాలన అందించాలి అని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.
జైలుకు పంపడం దారుణం: విడదల రజిని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు బనాయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో 74 ఏళ్ల వయసులో ఆయనను జైలుకు పంపడం దారుణం. గండికోట భూముల వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడే. కానీ ఆయననే నిందితుడిగా చూపించి వేధింపులకు గురిచేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పరాకాష్టకు చేరుకుంది. చట్టాలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యలను వదిలేసి వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ విధానంగా మారింది.
బ్రహ్మనాయుడికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది: గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పూర్తిగా అక్రమంగా కేసు బనాయించారు. ఆయనకు ఆ భూముల కేసులతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఆయనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారు. ప్రజలకు సేవ చేసిన ఒక సీనియర్ నాయకుడిని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటకు వస్తే ఈ కేసుల్లో నిజాలు ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి ప్రత్యర్థులను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి అక్రమ కేసులు, వేధింపులకు వైయస్ఆర్సీపీ భయపడదు. బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా నిలుస్తుంది.
గండికోట భూములు కేసులో బ్రహ్మనాయుడే బాధితుడు: గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు నిజాయితీ గల పెద్దమనిషి. ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్న నాయకుడిని రాజకీయ కక్షతో వేధించడం బాధాకరం. 74 ఏళ్ల వయసులో ఆయనపై కక్ష కట్టి జైలుకు పంపడం కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం. గండికోట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడు కాగా, ఆయననే నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలను పక్కనపెట్టి రాజకీయ వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అక్రమ కేసులు, రాజకీయ వేధింపులతో వైయస్ఆర్సీపీ నాయకులను భయపెట్టలేరు. వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి" అని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..