KCC Rules: దేశంలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా సకాలంలో, ఈజీగా రుణాలు అందించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
లోన్ల మంజూరు, రుణాల తిరిగి చెల్లిపుల కాల పరిమితిలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన పారదర్శకత తీసుకురావడానికి పంట కాలాల నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. కొత్త రూల్స్ 2027, జనవరి 1వ తేదీ నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.బ్యాంకుల ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ రూల్స్‌కి అనుగుణంగా పంట కాలాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించింది. స్వల్పకాలిక పంటల కాలాన్ని గరిష్ఠంగా 12 నెలలుగా, దీర్ఘకాలిక పంట కాలాన్ని గరిష్ఠంగా 18 నెలలుగా ఖరారు చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు ఒక వ్యక్తి తీసుకునే రూ.2 లక్షల లోపు లోన్లకు బ్యాంకులు ఎటువంటి మార్జిన్ మనీ, అదనపు ష్యూరిటీ అడగకూడదు. హామీ లేని లోన్ల పరిమితిలోపు, రైతులు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే దానిని కొలెటర్ ఫ్రీ రూల్స్ ఉల్లంఘనగా పరిగణించరు. దేశంలోని రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసేందుకు, సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి మోసపోకుండా, బ్యాంకుల ద్వారా చాల తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ఈ కార్డు ఉద్దేశం. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే రుణాలతో పోలిస్తే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. కేసీసీ కింద లభించే రుణాలపై బేసిక్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. ఒక వేళ రైతు తీసుకున్న లోన్ రూ.3 లక్షల వరకు ఏడాదిలోపు కరెక్ట్ గా తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం అదనంగా 3 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. అంటే క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే రైతులకు కేవలం 4 శాతం వడ్డీకే ఈ రణం లభిస్తుంది. రూ.1.60 లక్షల వరకు ఎలాంటి షురిటీ అవసరం లేదు. కొన్ని బ్యాంకుల్లో దీనిని రూ.3 లక్షల వరకు కూడా పొడిగించారు. ఈ కార్డు కాల పరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది, రైతు క్రెడిట్ హిస్టరీ బాగుంటే ప్రతి ఏటా లోన్ లిమిట్ 10 శాతం వరకు పెంచుకుంటూ వెళ్తారు.