
Indian Railways Ticketless Travel Fine : రైల్వే ప్రయాణికులకు అలర్ట్. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారికి గట్టి షాకిచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Indian Railways hikes penalty for ticketless travel to Rs 500
Indian Railways Ticketless Travel Fine : రైల్వే ప్రయాణికులకు అలర్ట్. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారికి గట్టి షాకిచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ప్రస్తుతం రూ.250 జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఆ జరిమానాను రూ.500కు పెంచాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది.
కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ లేకుండా పట్టుబడిన ప్రయాణికులు ప్రయాణించిన దూరానికి సంబంధించిన చార్జీతో పాటు రూ.500 అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
టికెట్ లేని ప్రయాణంతో పాటు ఇతరుల టికెట్‌ను ఉపయోగించడం, రైళ్లలో అనధికారికంగా వ్యాపారం చేయడం, భిక్షాటన, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, అసభ్య ప్రవర్తన వంటి ఉల్లంఘనలపై కూడా జరిమానాలను పెంచనున్నారు. మహిళలకు కేటాయించిన కోచ్‌లలో అనుమతి లేకుండా ప్రయాణించే పురుషులపై కూడా భారీ జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. ఆ మొత్తాన్ని రూ.2,500 వరకు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఒక ఏడాదిలో పదేపదే రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే జైలు శిక్ష కూడా విధిస్తారు.
ప్రయాణికుల టికెట్ లేని ప్రయాణం రైల్వే ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని అరికట్టేందుకు, ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెంపొందించడం, ప్రయాణాన్ని మురింత సురక్షితంగా మార్చడం లక్ష్యంగా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. ఒక్క సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోనే మే నెలలో 4.96లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ.40.85 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.