
కాసారం అనే అద్భుతమైన ఒక స్వీటు తయారీ గురించి క్షేమ కుతూహలం గ్రంథం వివరించింది. కాసారం అంటే కొలను. ‘‘చింతలేని సంసారమె - సారజలపు కాసారము’’ అని ఆర్యోక్తి.
కాసారం అంటే అలాంటి సారవంతంగా సుఖసంసారంలా ఉంటుందని! పోషక సారం అని అంతరార్థం! నేపాల్, బీహార్లలో కసార పేరుతో ఈ వంటకానికి ప్రసిద్ధి ఉంది. నేపాల్లో పెళ్ళి విందుల్లో ఇది తప్పనిసరి వంటకం కూడా! ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో పండుగ ప్రసాదంగా దీన్ని వండుకుంటారు. కసార ఒక సాంస్కృతిక వైభవం! ప్రాకృత భాషలో కంసారా సంస్కృతంలో కాసార గాను, వాడుకభాషలో కసారగానూ మారింది. మౌలికంగా ఇది బియ్యప్పిండి వంటకం. అయినప్పటికీ పాకశాస్త్ర గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉన్నప్పటికీ ఇది దక్షిణాదికి చేరినట్టు కనిపించదు. ‘కసార’ ఒక సాధారణ మిఠాయి మాత్రమే కాదు... అది ఆచారం, ఆనవాయితీ, కుటుంబ బంధాల ప్రతీకగా నిలిచిన ఒక ప్రత్యేక ఆహార సంప్రదాయం. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యి, ఉంటే కమ్మని కసార తయారైనట్టే! బియ్యాన్ని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేగించి మెత్తగా మరాడించి జల్లిస్తారు. ఒక భాండీలోకి కొద్దిగా నెయ్యి తీసుకుని కాచి అందులో ఈ బియ్యప్పిండిని కొద్దికొద్దిగా కలుపుతూ బాగా దగ్గరకొచ్చేలాగా వేగనిస్తారు. ఇప్పుడు మెత్తగా దంచిన బెల్లాన్ని కలపగానే లడ్డూ కట్టుకోవటానికి వీలుగా దగ్గరకొస్తుంది. చేతికి నెయ్యి రాసుకుని వేడిమీదే ఉండలు కడతారు. ఇందులో రుచి, పరిమళాల కోసం సోంపు, యాలకులు పచ్చకర్పూరం, జీడిపప్పు లాంటివి ఎవరి ఇష్టం కొద్దీ వారు కలుపుకోవచ్చు. చిటికెడంత పచ్చకర్పూరం కలిపితే అది దేవుడికి నైవేద్యం పెట్టినదనే పవిత్రభావన కలుగుతుంది, ఆహారాన్ని భక్తితో తినాలని కదా మన శాస్త్రాలు చెప్పింది. బొంబాయిరవ్వ మైదాపిండి వాడకానికొచ్చాక ఆహార పవిత్రత దెబ్బతింది. ఈ బియ్యప్పిండి లడ్డూకు బదులుగా మనం రవ్వలడ్డూలు చేసుకుంటున్నాం ఇప్పుడు. నిస్సారమైన ఈ రెండింటినీ ఆహార పదార్థాలుగా మార్చి దేవుడికి నైవేద్యం పెడ్తుంటే పండితులు కూడా కురుసభలో భీష్మాదుల్లా మౌనం వహించారు. నివేదనకు పనికిరానివిగా మైదా, బొంబాయి రవ్వల్ని ప్రకటించి ఉంటే మన వంటిల్లుని ఇవి ఆక్రమించి ఉండేవి కాదు. క్షేమశర్మ క్షేమకుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథంలో ఈ కసార స్వీటు గుణాలను వివరించాడు. ‘‘కాసారం రుచిరం శ్రేష్ఠం’’ ఎంతో రుచికరమైన శ్రేష్ఠమైన తీపి వంటకం ఇది. ‘‘నాతి రూక్షం న పిచ్ఛిలం’’ ఇది రవ్వలడ్డు లాగా గరుకుగానూ, కేసరి, హల్వాల లాగా అతి పిచ్ఛిలంగానూ కాకుండా లడ్డూ కట్టుకోవ టానికి అనువుగా తయారు చేసుకోవాలి. ‘‘హృల్లాసం కఫపిత్తఘ్నం విరుచీ రుచికారకం’’ కడుపులో వికారాలను పోగొడ్తుంది. కఫాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఆకలి పుట్టించి, రుచిని పెంచే వంటకం. శుష్కించిపోతున్నవారికి పుష్టిని, తుష్టిని, సంతృప్తినీ ఇస్తుంది. బడినుంచి ఇంటికి రాగానే పిల్లలకు పెట్టదగిన ఈ కసారా లడ్లు అమ్మప్రేమకు సంకేతంగా నిలుస్తాయి. దీని పేరులో ప్రాకృత మూలాలు ఉండటాన్ని బట్టి ఇది చాలా ప్రాచీనమైన వంటకం అని అర్థం అవుతోంది. క్షేమశర్మ ఈ వంటకంలో బియ్యప్పిండికి బదులుగా మినప్పిండి గానీ ఇంక ఇతర ధాన్యాల మెత్తని పౌడర్లను గానీ ఉపయోగించి తయారు చేసుకోవచ్చన్నాడు. కాబట్టి మన సున్ని ఉండలు కూడా కసార లడ్డుల్లో ఒక భాగమే! ‘లడ్డూ’లలో అత్యంత ప్రాచీనమైనది, మౌలికమైనది, ఒక విధంగా తొలి లడ్డూ అనదగినది ఈ కసార లడ్డూ. డా. జి వి పూర్ణచందు, 94401 72642 ఈ వార్తలు కూడా చదవండి: జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం మరవలేని మన ‘డిటెక్టివ్’... Read Latest AP News And Telangana News And International News And Telugu News