
హిమాలయాల ఉత్తర శిఖరాల నుంచి హిందూ మహాసముద్రపు దక్షిణ తీరాల వరకు ఆదివారం దేశమంతా యోగా చైతన్యంతో పులకించిపోయింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 190...
హిమాలయాల ఉత్తర శిఖరాల నుంచి హిందూ మహాసముద్రపు దక్షిణ తీరాల వరకు ఆదివారం దేశమంతా యోగా చైతన్యంతో పులకించిపోయింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కోట్లాది మంది యోగాసనాల్లో లీనమయ్యారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని, ఇది ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing) అనే ప్రత్యేక థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరిగాయి. కేవలం జీవనకాలాన్ని పెంచడమే కాకుండా, శారీరక, మానసిక దృఢత్వంతో కూడిన నాణ్యమైన జీవనాన్ని అందించడమే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.వయసు పెరిగినంత మాత్రాన మనిషిలోని సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు తగ్గిపోకూడదని, నిరంతర ఎదుగుదలకు యోగా ఒక అద్భుతమైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలను, ప్రపంచ మానవాళిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ఏడాది ఎంచుకున్న ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing) అనే అంశం కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాదని, ఇది ప్రతి ఒక్కరిలో జీవితకాల ఆరోగ్య చైతన్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. వేలాది మంది ఉత్సాహవంతులతో కలిసి ఆయన యోగాసనాలు వేస్తూ దేశప్రజల్లో స్ఫూర్తిని నింపారు. 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ తెచ్చిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడంతో ప్రారంభమైన ఈ గ్లోబల్ జర్నీ, నేడు ప్రపంచ సంక్షేమ ఉద్యమంగా మారింది.ప్రపంచాన్ని ఏకం చేస్తున్న యోగా శక్తిభౌగోళిక సరిహద్దులు, సంస్కృతీ సంప్రదాయాల విభేదాలను అధిగమించి మానవాళిని ఏకం చేసే గొప్ప శక్తి యోగాకు ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. భారతదేశంలో హిమాలయ శిఖరాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, తూర్పున ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్ నుండి పడమరన సౌరాష్ట్ర (గుజరాత్) వరకు దేశమంతా నేడు యోగా శక్తితో, నూతన ఉత్తేజంతో నిండిపోయింది అని ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 21 అనేది భూమిపై కొన్ని ప్రాంతాలలో అత్యంత పొడవైన పగలు గల రోజని, అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా ఈ రోజు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకల దినోత్సవంగా మారిందని ఆయన గుర్తుచేశారు.రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు సాధనఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. యోగాంధ్ర లోగో ఉన్న ప్రత్యేక షర్ట్ ధరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామ స్మరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబా పర్యవేక్షణలో సీఎం చంద్రబాబు అనులోమ-విలోమ పద్ధతుల్లో ప్రాణాయామం, వివిధ ఆసనాలను శ్రద్ధగా సాధన చేశారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్ బాబా శిష్యులు వేదికపై ప్రదర్శించిన కఠినమైన యోగాసనాలు వీక్షకులను అబ్బురపరిచాయి.ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు:రాష్ట్రంలో ప్రస్తుతం 1.33 లక్షల కేంద్రాల ద్వారా కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారని, దీనిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శాశ్వత యోగా మందిరాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.యోగా కార్యక్రమాలను పర్యవేక్షించడానికి జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని, స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ కోసం నిపుణుల బృందాన్ని, అలాగే యోగాంధ్ర కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేస్తూ, అందులో యోగాను భాగం చేసే ప్రతిష్టాత్మక సంజీవని ప్రాజెక్ట్‌ను రాబోయే ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ వేడుకలను తిరుపతిలో నిర్వహిస్తామన్నారు ప్రకటించారు.జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామన్నారు. రోజుకు ఒక గంట పాటు యోగా, ధ్యానం, ప్రాణాయామం జీవితంలో భాగం చేసుకుంటే అసలు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదని చంద్రబాబు ఆకాంక్షించారు.