
రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలయ్యాయి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక సభ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి 2026 ఖరీఫ్ సీజన్ కు గానూ తొలివిడత నిధులను విడుదల చేశారు.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా లబ్ధి చేకూరింది. ఇందులో 45,69,817 మంది భూ యజమాని రైతులు ఉండగా, మరో 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తోన్న గిరిజన రైతు కుటుంబాలు ఉన్నారు.తొలి విడతగా ఒక్కొక్కరికీ రూ.7 వేల సాయంఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతల్లో అందజేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14 వేలు కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేల చొప్పున రూ.3,125.47 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తం నిధులలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గత ఏడాది కూడా ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.8,985.41 కోట్లను రైతులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే...!!స్టాళ్ల పరిశీలన.. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు శంకుస్థాపనలింగంగుంట్ల ప్రజావేదిక సభ వద్ద వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా పరిశీలించారు. రైతులు, మహిళా సంఘాల నేతృత్వంలో ఏర్పాటైన ప్రాసెసింగ్ ప్లాంట్లు, వర్మీకంపోస్టు తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ మిషన్, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు సంబంధించిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడప, కర్నూలు ప్రాంతాల్లో నిర్మించనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్లు 2026 డిసెంబరు నాటికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి పనిచేయటం ప్రారంభిస్తాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా - అయితే, ఇలా చేస్తే వెంటనే..!!ప్రధాని మోదీ కార్యక్రమం వీక్షణపీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సభకు విచ్చేసిన వేలాది మంది రైతులతో కలిసి వీక్షించారు. ఈ అట్టహాసంగా జరిగిన అన్నదాత సుఖీభవ ప్రజావేదిక సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖ నేతలు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.