
Kayadu Lohar Social Media Break: హీరోయిన్ కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా విరామం ప్రకటించింది. తన మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని, స్క్రీన్లకు దూరంగా ఎక్కువ సమయం గడపాలని ఆమె భావిస్తున్నారు
. మరోవైపు, ఆమె నటించిన రాబోయే హారర్ థ్రిల్లర్ చిత్రం 'ఇమ్మోర్టల్' విడుదలకు సిద్ధమవుతోంది.
శరీరానికి విశ్రాంతి అవసరమైన కారణంగా.. మనసుకు కూడా విశ్రాంతిని ఇచ్చేందుకు సోషల్ మీడియా నుండి చిన్న విరామం తీసుకుంటున్నట్లు హీరోయిన్ కయాదు లోహార్ ఈ సందర్భంగా వెల్లడించింది.
తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో నటి కయాదు లోహర్ ఒక పోస్ట్ పెట్టింది. "సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నాను. కొన్నిసార్లు, మనం శరీరానికి ఇచ్చే విశ్రాంతి లాంటిదే మనసుకు కూడా అవసరం. కాస్త నెమ్మదించాలని, ప్రపంచానికి దూరంగా ఉంటూ, స్క్రీన్ అవతలి జీవితాన్ని, నన్ను నేను ఆస్వాదిస్తూ సమయం గడపాలని అనిపిస్తోంది" అని నటి రాసుకొచ్చింది.
"నాకు సపోర్ట్‌గా నిలుస్తూ.. ప్రోత్సహించి, ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు. మీ సందేశాలు, ప్రేమ నాకు ఎంతో విలువైనవి. నేను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ ఏవైనా ముఖ్యమైన అప్డేట్లు ఉంటే నా బృందం ఈ ఖాతా ద్వారా తెలియజేస్తుంది. అందరికీ జీవితాల్లో ప్రశాంతత, సంతోషం లభించాలని కోరుకుంటున్నాను. త్వరలో కలుద్దాం" అని కయాదు లోహర్ చెప్పుకొచ్చింది.
గత నెలలోనే ఈ నటి తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అందమైన సందేశాన్ని రాశారు. సినీ కెరీర్ పరంగా చూస్తే.. కయాదు లోహర్ ప్రస్తుతం 'ఇమ్మోర్టల్' అనే చిత్రంలో నటిస్తోంది. దర్శకుడు మరియప్పన్ రూపొందిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
ఓ కన్నడ సినిమాతో హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి కయాదు లోహర్.. ఆ తర్వాత తమిళంలో విడుదలైన 'డ్రాగన్' అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తెలుగులోనూ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇటు తెలుగులో 'మ్యాడ్ 2' సినిమాలో కయాదు లోహర్ తళుక్కున మెరిసింది. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన 'ఫంకీ' సినిమాలోనూ హీరోయిన్గా అలరించింది.