
మహిళల స్వేచ్ఛపై ఇరాన్ ప్రభుత్వం మరోసారి తన ఉక్కుపాదాన్ని మోపింది. అక్కడి కఠినమైన సాంప్రదాయ చట్టాలను ఉల్లంఘించిందనే నెపంతో ఒక అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓ సింగర్ మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడింది.
బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించలేదన్న ఒకే ఒక్క కారణంతో ఇరాన్‌కు చెందిన ప్రముఖ పాప్ గాయని, సంగీత దర్శకురాలు పరాస్తూ అహ్మదీ (29)కి అక్కడి న్యాయస్థానం అత్యంత ఘోరమైన శిక్షను ఖరారు చేసింది.
నిబంధనల ప్రకారం ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా హిజాబ్ ధరించడం అత్యంత తప్పనిసరి. అయితే, 2024 లో జరిగిన ఒక ప్రముఖ సంగీత ప్రదర్శనలో పరాస్తూ అహ్మదీ హిజాబ్ లేకుండా, స్లీవ్‌లెస్ దుస్తులతో స్టేజ్ ఎక్కి పాటలు పాడారు. స్లీవ్‌లెస్ దుస్తులతో ప్రేక్షకులను అలరించినందుకు గానూ.. ఇరాన్ ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆమెకు ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్షను విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొరడా దెబ్బల శిక్షతోనే ఈ వేధింపులు ఆగలేదు. పరాస్తూ అహ్మదీ రాబోయే రెండేళ్ల పాటు ఎలాంటి కన్సర్ట్స్ ఇవ్వకూడదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఆమె దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకుండా రెండేళ్ల పాటు ట్రావెల్ బాన్ కూడా విధించారు. గతంలోనూ హిజాబ్ సరిగ్గా ధరించలేదని మహ్సా అమీని అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె లాకప్‌లోనే మరణించడం అప్పట్లో ఇరాన్‌ను కుదిపేసింది. ఇప్పుడు మరోసారి గాయని పరాస్తూ అహ్మదీపై జరిగిన ఈ దారుణం ఇరాన్ మహిళల్లో సరికొత్త ఆగ్రహానికి కారణమవుతోంది.