
Singer Sunitha:తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గాయని సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె గాయని మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రముఖ హీరోయిన్లకు ఆమె తన స్వరాన్ని అందించారు. చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న సింగర్ సునీత, క్రమంగా ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగారు. ప్రేమ, భావోద్వేగం, భక్తి, విషాదం వంటి అన్ని రకాల పాటలను తన ప్రత్యేక గాత్రంతో ప్రేక్షకుల హృదయాలకు చేరవేశారు.
ఇప్పటికీ ఆమె పాడిన ఎన్నో పాటలు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, టెలివిజన్ కార్యక్రమాలు, సంగీత షోలు, రియాలిటీ ప్రోగ్రామ్‌ల ద్వారా కూడా సునీత ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. యువ గాయకులకు మార్గదర్శకంగా నిలుస్తూ, సంగీత రంగంలో తన అనుభవాలను పంచుకుంటున్నారు.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీత తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "మునుపటిలా ఇప్పుడు పాటలు ఎందుకు పాడటం లేదు?" అనే ప్రశ్నకు ఆమె భిన్నంగా స్పందించారు.
తాను ఇప్పటికీ పాటలు పాడుతూనే ఉన్నానని, అయితే ప్రేక్షకులు గమనించకపోవడం వల్ల అలాంటి అభిప్రాయం ఏర్పడిందని చెప్పారు. గతంలో తనకు వచ్చినట్లుగా ఇప్పుడు డ్యూయెట్ పాటలు లేదా ఫీల్ గుడ్ సాంగ్స్ ఎక్కువగా రావడం లేదని ప్రశ్నించగా, అది పూర్తిగా దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
తాను ఎవరినీ వెళ్లి పాటలు అడిగే స్థితిలో లేనని, అవకాశాలు వస్తే తప్పకుండా పాటలు పాడుతానని అన్నారు. ప్రస్తుతానికి మాత్రం చాలా మంది దర్శకులు తనకు అవకాశాలు ఇవ్వట్లేదు అని కూడా తెలిపారు. “నేను ప్రస్తుతానికి
ఒకరికి సలహాలు సూచనలు ఇచ్చే స్టేజ్‌లో ఉన్నాను నేనే పాడాలి నాకు పాటలు ఇవ్వండి అని అడిగే స్థానంలో లేను,” అని చెప్పారు.
ప్రస్తుతం తాను కొత్త తరానికి సూచనలు, సలహాలు ఇచ్చే దశలో ఉన్నానని సునీత పేర్కొన్నారు. మంచి పాటలు వస్తే తప్పకుండా పాడుతానని, సంగీతం పట్ల తనకు ఇప్పటికీ అదే ప్రేమ ఉందని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకులు సునీతకు చాన్స్ ఇవ్వకపోవడం వల్లే ప్రస్తుతం ఆమె వాయిస్ ఎక్కువగా వినిపించట్లేదు అని.. అందువల్లే ఆమె కెరియర్ ఉండాల్సిన స్థాయిలో ప్రస్తుతానికి లేదు అని కొంతమంది ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్లు కూడా పెడుతున్నారు.