రహదారుల పక్కన కేటాయించిన ఫుట్‌పాత్‌లపై నడవడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రహదారులపై వాహనాల రాకపోకల కంటే.. నడిచే హక్కుకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ్యానించింది. భారత భూభాగంలో ఎక్కడైనా పౌరుడు స్వేచ్ఛగా తిరిగే హక్కును కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(D)లో భాగంగా ఈ నడిచే హక్కు కూడా ఉంటుందని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఆర్టికల్ 19 (1)(a) 19(1)(b), 19(1)(c), భావప్రకటన స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 21తో కలిపి చదవాలని కూడా ధర్మాసనం పేర్కొంది.‘‘ఒక రహదారి ఉందంటే దాని పక్కన పాదచారుల కోసం ఫుట్‌పాత్‌ను ఏర్పాటుచేసి, సక్రమంగా నిర్వహించాల్సి బాధ్యత కచ్చితంగా ఉంది.. ఇది చట్టపరంగా అమలు చేయాల్సి బాధ్యత’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల బాలుడి పరిహారానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా కోర్టుపై విధంగా స్పందించింది. బాలుడ్ని తన తండ్రి ఉదయం 9 గంటలప్పుడు స్కూల్‌కు నడుచుకుని తీసుకెళ్తుండగా.. ట్యాంకర్ వచ్చి ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్రాంతంలో ఎటువంటి ఫుట్‌పాత్‌లు కానీ, రోడ్డు దాటడానికి క్రాసింగ్‌లు కానీ లేవు.ఈ కేసులో మృతిచెందిన బాలుడి తండ్రికి చెల్లించే పరిహారాన్ని రూ.11,44,628కు పెంచిన సుప్రీం కోర్టు..
దీనిని రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. పరిహారాన్ని తగ్గిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది. ‘‘ప్రత్యేకంగా కేటాయించిన ఫుట్‌పాత్‌లపై నడిచే హక్కుకు భంగం కలిగితే.. పౌరులు తమ హక్కుల పునరుద్దరణ, పరిహారం కోసం బాధ్యులైన అధికారులపై చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయించవచ్చు..
నష్టపరిహారం కోరవచ్చు.. అయితే ఈ పరిహారం మోటారు వాహనాల చట్టం 1988లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.సౌకర్యవంతమైన, సురక్షితమైన ఫుట్‌పాత్ లేకపోవడం, వాటిని వాహనాల రాకపోకల కోసం వదిలేయడం అనేది చాలా కాలంగా
ఎదుర్కొంటున్న సమస్య అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో నగరాలు, పట్టణాల ప్రణాళికలు వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించారని, దీనివల్ల పాదచారులు దుర్బలమైన స్థితిలో ఉన్నారని కోర్టు తెలిపింది.పట్టణాభివృద్ధి క్రమంగా మోటారు వాహనాల రాకపోకలకు ఎలా అనుకూలంగా మారిందో కోర్టు వివరించింది. చక్రాలు కనుగొనక ముందే మానవులు నకడ ప్రారంభించారని, ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం సంచార హక్కు నడిచే ప్రాథమిక హక్కేనని అది వ్యాఖ్యానించింది. ఈ హక్కు వాహనాల వినియోగానికి ముందే అందుబాటులో ఉంది కాబట్టి, సురక్షితమైన, ప్రత్యేకంగా కేటాయించిన ఫుట్‌పాత్‌లను పొందే హక్కు కచ్చితంగా అంతర్బాగమై ఉంటుందని తేల్చిచెప్పింది.