కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘KING 100’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ రాలేదు.
సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.‘కింగ్ 100’ సినిమాలో నటించే హీరోయిన్ల గురించి ఇప్పటికే అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని కన్ఫామ్ అయ్యాయి. నాగార్జున సరసన ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. టబు స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కి తెలుగులో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన 'ఎ', 'ఉపేంద్ర' వంటి సినిమాలు టాలీవుడ్ లో మంచి విజయం సాధించాయి. 'కన్యాదానం', 'రా', 'ఒక్క మాట' లాంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో అలరించిన ఆయన.. ‘S/o సత్యమూర్తి’, ‘గని’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. నాగార్జున విలన్ గా నటించిన ‘కూలీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఉపేంద్ర.. ఇప్పుడు కింగ్ 100వ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే, ఈ చిత్రం మరింత క్రేజీగా మారే అవకాశం ఉంది.‘KING 100’ చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పేదవాడి నుంచి సంపన్నుడిగా మారే రాగ్స్ టు రిచ్ కాన్సెప్ట్ తో వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. దీనికి 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో నాగార్జున విభిన్నమైన గెటప్స్ లో, వింటేజ్ లుక్స్ లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.