Largest IPO in India: అమెరికా- ఇరాన్ మధ్య డీల్ కుదరగా యుద్ధం దాదాపు ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. దీంతో చాలా రోజులకు మళ్లీ స్టాక్ మార్కెట్లలో మంచి జోష్ కనిపిస్తోంది. వరుస సెషన్లలో సూచీలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. దీంతో ముందుగా వాయిదా వేసినట్లుగా అనిపించిన పెద్ద పెద్ద సంస్థల నుంచి ఐపీఓ లు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు పలు సంస్థలు ఐపీఓ ప్రణాళికల్ని వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భారతదేశంలోనే అతిపెద్దవిగా భావిస్తున్నటువంటి ఐపీఓలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ కోసం డ్రాఫ్ట్ పేపర్స్ ఈ వారంలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో భారత అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (NSE) ఒక అడుగు ముందే ఉంది. జూన్ 17న అంటే బుధవారం రోజే మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) ప్రాథమిక ముసాయిదా పత్రాల్ని దాఖలు చేసింది.
ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓ..ఇక్కడ ఓఎఫ్ఎస్ అంటే కంపెనీ ఐపీఓ కోసం కొత్తగా షేర్లను ఇష్యూ చేయదు. సంస్థ ప్రమోటర్లు, షేర్ హోల్డర్లు వాటాను విక్రయించనున్నారన్నమాట.
సుమారు 6 శాతం వరకు వాటా విక్రయం చేపట్టడం ద్వారా రికార్డు స్థాయిలో రూ. 30 వేల కోట్ల మేర నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓగా అవతరిస్తుంది. ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.
27 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించి ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉంది. దానిన్ని NSE అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత రిలయన్స్ జియో వస్తే ఇది ఈ రెండింటినీ దాటనున్నట్లు తెలుస్తోంది. NSE వాల్యుయేషన్ రూ. 5 లక్షల కోట్లు..ప్రస్తుతం
అన్‌లిస్టెడ్ మార్కెట్లో NSE షేరు దాదాపు రూ. 2 వేల స్థాయిలో ఉండగా.. ఇదే ధర దగ్గర చూస్తే సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ. 5 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇదే జరిగితే మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల్లో నేరుగా లిస్టింగ్‌తోనే చేరే అవకాశాలు ఉంటాయి. ఈ ఐపీఓ కోసం సంస్థలో 10.72 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నటువంటి ఎల్ఐసీ వాటా విక్రయించడం లేదని తెలుస్తోంది. అయితే ఎస్బీఐ సహా మరికొన్ని పీఎస్‌యూలు తమ వాటాను అమ్మనున్నాయి. ఎస్బీఐ అత్యధికంగా 2.47 కోట్ల వరకు షేర్లను ఓఎఫ్ఎస్ కోసం అందుబాటులోకి తెస్తుందని సమాచారం. ఇతర PSU ల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సహా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి.