
నిత్య జీవితంలో మనం చేసే ఆధ్యాత్మిక సాధన సాధారణ రోజులలో కంటే కొన్ని ప్రత్యేకమైన రోజులలో విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రోజులు అంటే అమావాస్య ఆదివారం, అమావాస్య సోమవారం, ఏకాదశి గురువారం, శని త్రయోదశి, భాను సప్తమి మొదలైనవి.
పుష్యమీ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి కనుక పుష్యమీ నక్షత్రం గురువారం వస్తే దానిని గురు పుష్య యోగం అని పిలుస్తారు, యోగం అంటే కలయిక అటువంటి మేలు కలయిక నేడు. సంవత్సరంలో అనేకసార్లు ఇలాంటి యోగాలు వస్తాయి, కానీ నేడు వచ్చిన ఈ గురు పుష్య యోగం చాలా ప్రత్యేకం మాత్రమే కాక దీనిని అలభ్య యోగం అని చెప్పవచ్చు.
నవగ్రహాలలో నైసర్గిక శుభుడైన బృహస్పతి బలం విశిష్టమైనది. బృహస్పతినే గురువు అని కూడా పిలుస్తారు. దేవ గురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి గురు పుష్య యోగం నేడు (Guru pushya yoga in 2026). బృహస్పతికి కర్కాటక రాశి ఉచ్చ స్థానం.
మిగిలిన రాశులలో బృహస్పతి సంచరించే సమయంలో ఇచ్చే ఫలితాల కంటే కర్కాటక సంచారంలో ఇచ్చే ఫలితాలు ప్రత్యేకము. ఈ గురు పుష్య యోగంలో చేసే ఏ కొద్దిపాటి ఆధ్యాత్మిక సాధనైనా అనంతమైన ఫలితాన్ని అందిస్తుంది. మంత్రానుష్ఠానాదులకు, గురువు ద్వారా నూతన మంత్రోప్రదేశం పొందడానికి, నూతన మంత్రసాధన ప్రారంభించడానికి, నూతన విద్యా ప్రారంభానికి, అక్షరాభ్యాసాదులకు, ఉపనయనమునకు, ఔషధాది ఉపయోగాలకు, పరిశోధనలకు అద్భుతమైన రోజు.
ఇష్ట దేవతారాధన, నిత్య దేవతారాధనతోపాటు బృహస్పతి దర్శనం, అర్చన, స్తోత్ర పారాయణ, ఉడికించిన శనగలు నివేదించడం 16 లేక 116 లేక 160 నానబెట్టిన శనగలను పసుపు రంగు దారంతో దండగా గుచ్చి బృహస్పతికి సమర్పించడం ద్వారా జాతకంలో గురు బలం లేని వారికి గోచార రీత్యా గురువు ప్రతికూల స్థానంలో ఉన్నవారికి బృహస్పతి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. గ్రహబలాలలో గురు బలం చాలా ప్రత్యేకమైనది.
లేకపోతే ఎటువంటి విద్యలు అబ్బవు. జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి, చక్కగా మాట్లాడే శక్తి, వాక్శుద్ధి, వాక్సిద్ధీ, పుత్ర యోగం, వంశ వృద్ధి, దైవీ సంపద, ముఖ వర్చస్సు, సంతృప్తి కరమైన జీవనం, మైత్రీ భావన ఇవన్నీ బృహస్పతి అనుగ్రహంతో లభించేవే.
గోచార రీత్యా జన్మ రాశి నుండి గురువు 1, 4, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిశ్శాస్త్ర గ్రంథములు సూచిస్తున్నాయి. కొన్ని గ్రంథములలో జన్మరాశి నుండి 1, 4, 8, 12 స్థానాలతో పాటు 3, 6, 10 స్థానాలలో ఉన్నప్పుడు కూడా బృహస్పతి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.
శ్లో॥ జన్మంచ రామ దుఃఖంచ త్రీణి దుర్యోధనస్తధా, చత్వారి పాండవశ్చైవ షష్ఠిభిర్బలి బంధనం|| అష్టభిర్హరతే వాలి దశమం తారకాసురైః ద్వాదశం రావణం హన్తి ఇత్యైతే గురు దారకాః||
శ్రీరాముడు, బలి చక్రవర్తి, వాలి, రావణుడు, ధుర్యోధనాదులు వారికి అనుకూల స్థానాల్లో గురు గ్రహ బలం లేకనే సమస్యలు ఎదుర్కొన్నారని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. గోచార రీత్యా గ్రహాల ప్రతికూలత ఎంత తీవ్రంగా ఉంటుందనేది జాతక చక్రంలో ఆయా గ్రహాల స్థితిని బట్టి ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. ఏ శాస్త్రమైతే గ్రహ అనుకూలత, ప్రతికూలతలను సూచిస్తుందో అదే శాస్త్రం పరిహారాలను కూడా మనకు అందించింది కనుక ఆయా పరిహారాలను పాటిస్తూ.. ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతారాధన చేస్తూ చక్కగా జీవనాన్ని కొనసాగించవచ్చు అన్న విషయం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఇలాంటి విశేషమైన రోజున యధాశక్తిగా దేవతారాధన, మంత్రోపాసన, నామ సంకీర్తనాదులు చేసి భగవంతుని అనుగ్రహం పొందడానికి లభించిన ఈ అలభ్య యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
గృహదేవతారాధన ఇష్టదేవతాస్మరణతో పాటు బృహస్పతి ఆరాధన స్తోత్ర పారాయణ నామస్మరణ చేయడం క్షేమ దాయకం, శుభదాయకం. ప్రస్తుతం మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశుల వారికి గురు బలం తక్కువగా ఉన్నది. వారు విధిగా నేడు బృహస్పతిని ఆరాధించడం ఉపాసించడం వలన శుభ ఫలితాలు పొందగలరు. కేవలం ఈ రాశుల వారు మాత్రమే కాకుండా మిగిలిన రాశుల వారు కూడా బృహస్పతిని ఆరాధించడం వలన మరిన్ని అనుకూల ఫలితాలతో పాటు కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని పొందగలుగుతారు. గురు పుష్య యోగం వచ్చిన నేడు దక్షిణామూర్తి, దత్తాత్రేయ ఆరాధన దర్శనం స్తోత్ర పారాయణ విశేష ఫలదాయకం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
గురు బలం