ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు సంబంధించిన జీవోను ఏపీ ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది.
ఈ మేరకు బుధవారం రోజు జీవో నంబర్ 362ను అధికారులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) 12 జిల్లాల్లో గుర్తించిన ప్రాంతాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు గైడ్ లైన్స్ రూపొందించారు. 2026 సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్ట్ నెల వరకూ బీచ్ షాక్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మరోవైపు పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బీచ్‌లలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకూ బీచ్ షాక్స్ నిర్వహించనున్నారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని బీచ్‌లలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
బీచ్ షాక్స్.. ఇందులో ఏముంటాయ్..బీచ్ షాక్స్ అంటే సముద్ర తీరం వెంట ఏర్పాటు చేసే టెంపరరీ నిర్మాణాలు. పూర్తి పర్యావరణ అనుకూలంగా వీటిని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా వీటిని వెదురు బొంగులు వంటి వాటితో ఏర్పాటు చేస్తారు. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ సేద తీరేందుకు బీచ్ బెడ్లుంటాయి.
అలాగే బీచ్ బెడ్ల వద్ద నుంచే మనకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. బీచ్ షాక్స్‌లలో బీర్లు, వైన్లు, జ్యూస్‌లు, సీఫుడ్, ప్రాంతీయ వంటకాలు, కాక్టెయిల్, డ్రింక్స్, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంచుతారు. అలాగే షవర్, వాష్ రూమ్స్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు.
అయితే బీచ్ షాక్స్‌లో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయాలకు ఏపీ ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వలేదు. మరోవైపు మన దేశంలో గోవా వంటి చోట్ల బీచ్ షాక్స్ చాలా ఫేమస్. మన దగ్గర కూడా ఇలాంటి
వాటిని ఏర్పాటు చేయటం ద్వారా మరింత మంది పర్యాటకులకు బీచ్‌ల వద్దకు ఆకర్షించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సముద్ర తీరాలలో సరదాగా ఛిల్ అవుదామని భావించే చాలా మందికి ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. ఇలాంటి అనుభూతుల కోసం గోవా వంటి ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా త్వరలో ఏపీలోనే బీచ్ షాక్స్ మనం చూడొచ్చు.