
ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టు పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా, రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ బలగాలకు తలనొప్పిగా మారిన మహిళా మావోయిస్టు నేత శకుంతల అలియాస్ పుష్ప లొంగిపోయారు. ఒక తుపాకీ, 40 రౌండ్ల తూటాలతో కోల్కతా పోలీసుల ముందు ఆమె సరెండర్ అయ్యారు.
ఆమెపై ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన సంగతి గమనార్హం. ఈ సందర్భంగా కోల్కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్ మాట్లాడుతూ, శకుంతల 2001లో చిన్న వయసులోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై సంస్థలో చేరినట్లు తెలిపారు. తొలుత సాంస్కృతిక విభాగంలో విప్లవ గీతాలు, ప్రచార కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీలతో చురుగ్గా పని చేశారు.
తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)లో కీలక నేతగా ఎదిగారు. దల్మా జోన్ జోనల్ కమిటీ సభ్యురాలిగా బీహర్-జార్ఖండ్-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అనేక హింసాత్మక ఘటనల్లో ఆమె పాత్ర ఉన్నట్లు వెల్లడించారు.సరెండర్ అనంతరం మీడియాతో మాట్లాడిన శకుంతల, “హింస వల్ల భవిష్యత్ లేదు” అంటూ అడవుల్లో ఇప్పటికీ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టులకు సందేశం ఇచ్చారు.
“తుపాకీ పట్టుకోవడం కంటే ప్రశాంతంగా జీవించడం మంచిది. హింసతో ఎలాంటి భవిష్యత్తు లేదు. అందరూ త్వరగా ఆయుధాలు వదిలి సమాజంలోకి వచ్చి కొత్త జీవితం ప్రారంభించాలి” అని పిలుపునిచ్చారు. శకుంతల సరెండర్తో జంగల్మహల్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు నెట్వర్క్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఆమెను చూసి మిగిలిన క్యాడర్లు కూడా లొంగిపోయే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు
.