
హనుమకొండ చౌరస్తా, జూన్ 17: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగాధిపతి, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్ రచించిన ‘వరల్డ్ ఆఫ్ ఫైవ్ జీరోస్’ పుస్తకాన్ని బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఆచార్య ఎస్.మహేంద్రదేవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేంద్ర దేవ్ మాట్లాడుతూ పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, నికర కార్బన్ ఉద్గారాలు, సంఘర్షణలులేని సమాజ నిర్మాణానికి ఈ పుస్తకం దార్శనికతతో కూడిన ఆచరణాత్మక మార్గదర్శకాన్ని అందిస్తుందని తెలిపారు.
పుస్తక రచయిత సురేష్‌లాల్ మాట్లాడుతూ సున్నా పేదరికం, నిరుద్యోగం, అసమానత, నికర కార్బన్ ఉద్గారాలు, సంఘర్షణ అనే ఐదు ప్రధాన లక్ష్యాల ఆధారంగా మానవ సంక్షేమం, సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ శాంతి సాధనకు అవసరమైన విధానాలను ఈ గ్రంథంలో ప్రతిపాదించినట్లు తెలిపారు. కేస్ స్టడీలు, నిపుణుల విశ్లేషణలు, కార్యాచరణ వ్యూహాల ద్వారా ఈ లక్ష్యాల పరస్పర అనుసంధానాన్ని వివరించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ గాటే, ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.డి.ఎన్. భాజ్‌పాయ్, జనరల్ సెక్రటరీ రవీంద్ర బర్మే, ప్రముఖ ఆర్థికవేత్త అశ్విని మహాజన్ పాల్గొని సురేష్లాల్ను అభినందించారు
.