
ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతుంటే ప్రతిసారీ కొందరు ఆటగాళ్లపై అందరి దృష్టీ నిలుస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ఈ మెగా టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఆటగాళ్లలో లియోనెల్ మెస్సి ముందు వరుసలో ఉంటాడు. 38 ఏళ్ల వయసులో తన చివరి ప్రపంచకప్ ఆడుతూ మరోసారి టోర్నీకే ప్రధాన ఆకర్షణగా మారాడు మెస్సి.
గత ఏడాది భారత పర్యటనతో ఇక్కడి అభిమానులను ఉర్రూతలూగించిన మెస్సి.. ఇప్పుడూ అదే జోష్ చూపించాడు. మొదటి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో అబ్బురపరిచాడు. చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యం పాలైన కుర్రాడు.. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం అనూహ్యం.
ప్రపంచంలోని అన్ని ఆటల్లో శారీరకంగా అత్యంత శ్రమ అవసరమైన ఆట ఫుట్‌బాలే అంటే అతిశయోక్తేమీ కాదు. 90 నిమిషాల పాటు ఆపకుండా పరుగులు పెడుతూ ఉండాలి. ప్రతి నిమిషం చుట్టుముట్టే భారీకాయులను తప్పించుకుంటూ బంతిని ముందుకు తీసుకెళ్లాలి. ఒంటి కాలితో విన్యాసాలు చేస్తూ బంతిని గోల్ పోస్టులోకి పంపాలి.
అందుకోసం అసాధారణమైన ఫిట్నెస్ కావాలి. కానీ చిన్న వయసులో తీవ్ర అనారోగ్యం పాలై, శారీరక వైకల్యం ఏర్పడే స్థితికి చేరుకున్న ఓ ఆటగాడు ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే పరిపూర్ణ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించడం సామాన్యమైన విషయం కాదు.
మెస్సి ఇలాంటి స్థితి నుంచే ఎదిగాడు. అర్జెంటీనాలో స్పెయిన్ మూలాలున్న కుటుంబంలో అతను పుట్టాడు. తండ్రి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్. 11 ఏళ్ల వయసులో అతడికి అరుదైన వ్యాధి సోకింది. హార్మోన్ లోపం తలెత్తింది. దాంతో ఎదుగుదల ఆగిపోయే పరిస్థితి.
అప్పటికే ఫుట్‌బాల్‌లో అతను మంచి నైపుణ్యం సంపాదించాడు. క్లబ్ స్థాయిలో మెరుపులు మెరిపించాడు. మధ్యతరగతికి చెందిన మెస్సి కుటుంబానికి అతడి చికిత్స ఖర్చును భరించే పరిస్థితి లేదు. అయితే చిన్న వయసులోనే మెస్సి ప్రతిభను గుర్తించిన బార్సిలోనా క్లబ్..
ఎదుగుతూ సాగాడు. టీనేజీలోనే ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. బార్సిలోనా క్లబ్లో మెస్సికి గురువులా వ్యవహరించిన దిగ్గజ ఆటగాడు రొనాల్డిన్హో 2005లో ప్రతిష్టాత్మక ‘బాలన్ డో’ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా.. బార్సిలోనా క్లబ్లో తాను అత్యుత్తమ ఆటగాడిని కాదని.. ప్రపంచ మేటి ఫుట్‌బాలర్ కాబోయే మరో ఆటగాడున్నాడని మెస్సి గురించి జోస్యం చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అప్పటికి మెస్సికి 18 ఏళ్లే. రొనాల్డిన్హో మాటలు అప్పటికి చాలామందికి అతిశయోక్తుల్లా అనిపించాయి. కానీ కొన్నేళ్లకే ప్రపంచమంతా ఆ మాట నిజమని ఒప్పుకొంది. ఏకంగా 8 సార్లు ‘బాలన్ డో’ పురస్కారాన్ని అందుకుని చరిత్ర సృష్టించాడు లియోనెల్. క్రిస్టియానో రొనాల్డో 5 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సి రికార్డు ఎప్పటికీ బద్దలు కాకపోవచ్చన్నది నిపుణుల మాట.
మెస్సి ఆటను ఓ పది నిమిషాలు చూస్తే చాలు.. ఫుట్‌బాల్ ఆట గురించి పెద్దగా తెలియకపోయినా అతడి ప్రేమలో పడిపోతారు. అంత అందంగా, ఒక సొగసుతో సాగుతుంది. అతను బంతిని డ్రిబ్లింగ్ చేసే తీరు.. చుట్టూ ఎందరున్నా బంతిని ఎవరికీ చిక్కనివ్వకుండా దూసుకెళ్లే వైనం చూసి ముగ్ధులవ్వాల్సిందే. యూట్యూబ్‌లోకి వెళ్లి మెస్సి ఫ్రీ కిక్స్, మెస్సి గోల్స్ అని కొట్టి చూస్తే అతడి అసాధారణ నైపుణ్యం కళ్లకు కడుతుంది. ఇటు క్లబ్ ఫుట్‌బాల్‌లో, అటు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అతడి ఘనతలు అసామాన్యం. ఆటలో ఘనతల పరంగా పీలే, మారడోనా లాంటి దిగ్గజాలను అతను దాటేశాడు. అయితే తన సమకాలీనుడైన రొనాల్డోది కొన్ని అంశాల్లో పైచేయి. ఓవరాల్ గోల్స్ (రొనాల్డో 973, మెస్సి 911)లోనే కాక అంతర్జాతీయ గోల్స్ (రొనాల్డో 143, మెస్సి 117)లో అతనే ముందున్నాడు.
కానీ ఒక మ్యాచ్‌లో జట్టుకు విలువ చేకూర్చడంలో, ఎంతో సొగసుతో ఫుట్‌బాల్ ఆడడంలో మెస్సి కొన్ని మెట్లు పైనే ఉంటాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రొనాల్డో సాధించని ఘనతలను లియోనెల్ అందుకున్నాడు. 2022లో అతడి జట్టు అర్జెంటీనా ప్రపంచకప్ గెలిచింది. ఆ విజయంలో కెప్టెన్‌గా, ఆటగాడిగా మెస్సిది అత్యంత కీలక పాత్ర. అతను రెండుసార్లు (2021, 2024) కోపా అమెరికా ఛాంపియన్ కూడా అయ్యాడు. ఇక ఏటా అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే బాలన్ డో పురస్కారాన్ని ఏకంగా ఎనిమిదిసార్లు అందుకున్నాడు మెస్సి. అందుకే ఫుట్‌బాల్ నిపుణులు రొనాల్డో కంటే మెస్సిని ఒక మెట్టు పైన నిలుపుతారు.
మిగతా స్టార్ ఫుట్బాలర్లతో పోలిస్తే మెస్సిని భిన్నంగా నిలిపేది అతని వ్యక్తిత్వమే. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా పేరు సంపాదించినా.. వేల కోట్ల ఆస్తులు కూడగట్టినా.. అతడిలో రవ్వంతైనా గర్వం ఉండదు. భారత పర్యటన సందర్భంగా ఎక్కడైనా అతడిలో అసహనం, అహంకారం చూశారా? కోల్‌కతాలో ఇబ్బందికర వాతావరణంలోనూ కొంచెం కూడా అదుపుతప్పి ప్రవర్తించలేదు. హైదరాబాద్‌లో గంటసేపు ఓపిగ్గా మైదానంలో అభిమానులను అలరిస్తూ సాగాడు. ముంబయి, దిల్లీల్లోనూ అంతే. ప్రముఖులతోనే కాక సామాన్య అభిమానులతోనూ ఎంతో ఓపికగా వ్యవహరించాడు. ఇందులో నటన ఏమీ లేదు. కెరీర్ ఆరంభం నుంచి అతడిది అదే అణకువ. వివాదాల జోలికి వెళ్లడు.
అలాగే చాలామంది ఫుట్బాలర్లలా బోలెండంత మంది అమ్మాయిలతో శృంగారం, ప్రేయసులను మార్చడం లాంటివేమీ లేవు. తన చిన్ననాటి స్నేహితురాలైన ఆంటోనెలా రొకుజ్జోతో ప్రేమలో పడ్డాడు. తననే పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మెస్సిలో దానగుణం కూడా ఎక్కువే. చిన్న వయసులో తాను అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నందున ఇలాంటి జబ్బులతో బాధపడే చిన్నారులకు అతను తన ఫౌండేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నాడు. ఇంకా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అతడితో ఒప్పందం చేసుకుని చికిత్స ఖర్చును స్పాన్సర్ చేయడానికి ముందుకువచ్చింది. ఈ వ్యాధితో పోరాడుతూనే ఆటలో