
ఈ రెండేళ్లలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1 శాతం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) చెప్పారు. అమరావతి సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన నిఘా వ్యవస్థ, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, అంతర్‌శాఖ సమన్వయాన్ని మెరుగుపర్చడం ద్వారా రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన వ్యవస్థలను ప్రజా సేవా దృక్పథంతో పునర్నిర్మిస్తూ, ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పరిపాలనా వ్యవస్థను చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్‌ను కోటీ 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.
సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు వార్ రూమ్స్ (War rooms) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సైబర్ వార్ రూమ్స్ ఏర్పాటు, బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం, 1930 సైబర్ హెల్ప్‌లైన్, ఆన్లైన్ మోసాలపై రియల్‌టైమ్ స్పందన వంటి చర్యల ఫలితంగా సుమారు రూ.247 కోట్ల ప్రజల సొమ్ము మోసగాళ్లబారినపడకుండా చేశామన్నారు.
ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. 6 వేల మందికిపైగా పోలీసు నియామకాలు చేపట్టామని, పదోన్నతులు కల్పించామని, కానిస్టేబుల్ (Constable) శిక్షణార్థులకు స్టైఫండ్ పెంచామని మంత్రి చెప్పారు. వచ్చే జాబ్ క్యాలెండర్లో 2700 పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
విపత్తుల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు
.