సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఐఎస్బీ క్యాంపస్ లైంగిక దాడి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు మంగళవారం ఒక కీలక తీర్పును వెలువరించింది.
తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ తెలంగాణ హైకోర్టు నిందితుడికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ.. 40 ఏళ్ల బాధితురాలు దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కేసు నమోదు చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యాన్ని, పిటిషనర్ వయస్సును ప్రధానాంశాలుగా పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ పిటిషన్లో తదుపరి విచారణకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది.ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2023 మే 30వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) క్యాంపస్‌లో ఉన్న స్టూడెంట్ అపార్ట్మెంట్లో ప్రథమ్ సింగ్ అనే వ్యక్తి తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. అయితే.. ఈ ఘటన జరిగిన దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అంటే 2025 డిసెంబరు 26న ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 351(2), 69 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఇద్దరి మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన సంబంధాలు ఉన్నాయని, కేవలం తప్పుడు ఆరోపణలతోనే రెండున్నరేళ్ల ఆలస్యంగా కేసు పెట్టారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. దాంతో హైకోర్టు గత మే 29, 2026న నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు మహిళ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోడా ధర్మాసనం ముందు గట్టి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందన్న ఏకైక కారణంతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని కానీ కింది కోర్టు పేర్కొన్న అంశాలలో నిజం లేదని అరోడా వాదించారు. ఈ సమయంలో జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం జోక్యం చేసుకుని పలు ప్రశ్నలు సంధించింది. సంఘటన జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని జస్టిస్ మెహతా ప్రశ్నించారు. అందుకు దారితీసిన కారణాలను బాధితురాలు తన ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొందని డిజిటల్ ఆధారాలు కూడా ఉన్నాయని న్యాయవాది బదులిచ్చారు.కానీ, జస్టిస్ సందీప్ మెహతా క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ నిబంధనలను ప్రస్తావిస్తూ ఆ కారణాలతో ఏకీభవించలేదు. ఇంత సుదీర్ఘ జాప్యం జరిగితే చట్టప్రకారం కేసు తీవ్రత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం న్యాయమూర్తి 'పిటిషనర్, నిందితుడి వయసెంత?' అని ప్రశ్నించారు. నిందితుడి వయసు 38 ఏళ్లు, పిటిషనర్ వయసు 40 ఏళ్లు అని న్యాయవాది సమాధానం ఇవ్వగానే.. జస్టిస్ మెహతా వెంటనే స్పందిస్తూ 'థాంక్యూ.. డిస్మిస్' అని తీర్పు చెబుతూ విచారణను ముగించారు. అయితే.. నిందితుడు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉన్నందున అతని పాస్‌పోర్టును కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ కోరగా.. దానిపై కింది కోర్టు లేదా ట్రయల్ కోర్టుకు విజ్ఞప్తి చేసుకునే స్వేచ్ఛను ఇస్తున్నట్లు పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును క్లోజ్ చేసింది.