కేంద్ర ప్రభుత్వం అందిచే సామాజిక భద్రతా పథకాల్లో ఈ అటల్ పెన్షన్ యోజన సైతం ఒకటి 2015 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) దీనిని నిర్వహిస్తుంది. తక్కువ ఆదాయ అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత నిర్ణీత మొత్తంలో పెన్షన్ పొందుతారు. రూ.1000 నుంచి రూ.5000 వరకు లభిస్తుంది. పెన్షన్ సమయంలో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇస్తారు. ఆమె కూడా మరణిస్తే ఆ కార్పస్ వారసులకు ఇస్తారు. అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారు ఇందులో చేరేందుకు ఉండదు. భారతీయ పౌరులు ఎవరైనా అర్హతలు కలిగి ఉంటే ఈ పథకంలో చేరి ప్రీమియం చెల్లించవచ్చు.
అటల్ పెన్షన్ పథకంలో ఎంత ప్రీమియం కట్టాలి అనేది వారి వయసును బట్టి మారుతుంది. రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. తమకు ఎంత పెన్షన్ రావాలి అనేది నిర్ణయించుకుని దానికి అనుగుణంగా పేమెంట్ చేసుకోవాలి. 18 ఏళ్ల వయసులో చేరినవారు 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 42 ఏళ్ల ఈ పథకంలో ప్రీమియం కట్టాలి.
18 ఏళ్లకే ఇందులో చేరే వారు నెలకు రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు కట్టవచ్చు. రూ.210 కడితే రూ.5000 పెన్షన్ లభిస్తుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరే వారు 20 ఏళ్ల పాటు ప్రీమియం కట్టాలి. వీరు రూ.291 నుంచి రూ.1454 వరకు చెల్లించాల్సి వస్తుంది.
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన సభ్యులు వారి చెల్లింపులకు తగినట్లుగా 60
ఏళ్ల వయసు దాటాక నెలవారీ కచ్చితమైన పెన్షన్ పొందుతారు. నెల నెలా చేసే కంట్రిబ్యూషన్‌ను అనుసరించి రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 వరకు పెన్షన్ పొందుతారు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5000 పెన్షన్ పొందాలంటే మీ వయసు ఇప్పుడు 18 ఏళ్లు అయితే నెలకు రూ.210 కట్టాలి. అదే మీ వయసు 40 ఏళ్లు అయితే మీరు నెలకు రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది.
అటల్ పెన్షన్ యోజన ద్వారా 3 రకాల ప్రయోజనాలు లభిస్తాయి. నిర్ణీత వయసు దాటక పెన్షన్ తో పాటు ఒక వేళ చందాదారు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ అవుతుంది. వారిద్దరూ చనిపోతే నామినీకి రిటైర్మెంట్ కార్పస్ అందుతుంది. వెయ్యి పెన్షన్ ఎంచుకుంటే రూ.1.70 లక్షలు, రూ.2 వేలు ఎంచుకుంటే రూ.3.40 లక్షలు, రూ.5 వేలు ఎంచుకుంటే రూ.8.50 లక్షల కార్పస్ వస్తుంది.
పోస్టాఫీసుతో పాటు అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ పథకంలో చేరవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే బ్యాంక్ శాఖకు వెళ్లి రిజిస్ట్రేషన్ ఫారంలోని అన్ని వివరాలు పొందుపరిచి డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఆన్లైన్లో అయితే బ్యాంక్ మొబైల్ యాప్, eNPS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఆధార్, సేవింగ్స్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్, వయసు ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
ఈ పథకంలో చేరిన సభ్యులు బ్యాంక్ ఖాతాను కంట్రిబ్యూషన్ ఖాతాతో లింక్ చేసి నెలవారీగా ఆటో డెబిట్ ఎంచుకోవచ్చు. ప్రతి నెలా బ్యాంకు అకౌంట్లో తగిన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే పెనాల్టీ పడుతుంది. నెలకు రూ.100 కట్టే వారు రూపాయి పెనాల్టీ కట్టాలి. నెలకు రూ.101 నుంచి రూ.500 కట్టేవారు రూ.2, రూ.1000లోపు చెల్లించేవారు రూ.5, రూ.1000 పైన చెల్లించేవారు రూ.10 చొప్పున పెనాల్టీ కట్టాలి. 6 నెలలు వరుసగా కట్టకపోతే పెన్షన్ ఖాతా ఆగిపోతుంది. 24 నెలల వరకు కట్టకపోతే ఖాతాను మూసేసి కట్టిన డబ్బులు ఇచ్చేస్తారు.
ఇందులో చేరిన వ్యక్తి 60 సంవత్సరాలు రాక ముందే మరణిస్తే ఆ వ్యక్తి అకౌంట్ కొనసాగుతుంది. కానీ, ఈ ఆప్షన్ అతడి జీవిత భాగస్వామికి మాత్రమే ఉంటుంది. మరణించిన చందాదారుని వయసు 60 ఏళ్లు దాటే వరకు ఆ ఖాతను కొనసాగించవచ్చు. వయసు పరిమితి దాటాక పెన్షన్ వస్తుంది. ఒకవేళ అకౌంట్ మూసేయాలంటే ఏపీవై ఖాతా తీసుకున్న వ్యక్తి పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ సహా మొత్తం భాగస్వామికి చెల్లిస్తారు. ఒక వేళ మరణించిన వ్యక్తికి వివాహం కకపోతే, విడాకులు అయితే నామినీకి ఇస్తారు.
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి