
AP PECET 2026 Results: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET)-2026 ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శారీరక విద్య మరియు క్రీడల రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శారీరక విద్య మరియు క్రీడల రంగంలో తదుపరి అడుగు వేసిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్... భవిష్యత్ విద్యా, వృత్తిపరమైన ప్రయాణంలో ప్రతి అభ్యర్థి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది AP PECET-2026 పరీక్షలో మొత్తం 4,037 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 2,958 మంది పరీక్షకు హాజరయ్యారు.
పరీక్ష రాసిన వారిలో 2,655 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 89.76 శాతంగా నమోదైంది. ఇక, పురుష అభ్యర్థుల విషయానికి వస్తే, 1,993 మంది అర్హత సాధించి 92.91 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మహిళా అభ్యర్థుల్లో 662 మంది అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 81.43 శాతంగా నమోదైంది.
అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. అలాగే ర్యాంక్ కార్డులను కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ (9552300009) ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు
.