
తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ నష్టం జరగని రీతిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. “రెంటల్ విధానంలో ఒక థియేటర్ కి రూ. 7.30 లక్షలు వస్తుందనుకుంటే, పర్సంటేజ్ పద్ధతిలో ఆ ఓనర్ రూ.
10 లక్షల వరకు ఆశించడంలో తప్పులేదు. కానీ, ఏకంగా పాతిక లక్షలు ఇవ్వాలని పట్టుబడితే అది ఎంతమాత్రం సహేతుకం కాదు. సినిమాల్లో నష్టాలు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే నాథుడే లేడు. అప్పుల పాలై ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు.
‘అఖండ 2’ లాంటి సినిమాకు నష్టాలు వస్తే నిర్మాత గురించి ఎవరు మాట్లాడారు? పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంటే, ఇక చిన్న సినిమా నిర్మాతల ఇబ్బందులు వర్ణనాతీతం. ఎగ్జిబిటర్కి తన థియేటర్ ఒక సేఫ్ ప్రాపర్టీగా ఉంటుంది. కానీ హీరోలు తక్కువ సినిమాలు చేయడం వల్ల ప్రస్తుతం ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు” అని విశ్లేషించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన పర్సంటేజ్ సబ్ కమిటీపై నట్టి కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ సబ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్న డి. సురేష్ బాబు, దిల్ రాజు ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా ఎంతో క్లోజ్. కానీ వారు లీజ్ ఓనర్స్ అవ్వడం వల్ల సహజంగానే ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
దీనివల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అన్యాయం జరుగుతుందనే అనుమానాలు పరిశ్రమలో చాలామందికి ఉన్నాయి. అందుకే వారిద్దరూ ఈ కమిటీ
నుండి తప్పుకోవాలి. వారి స్థానాల్లో కె.ఎల్. నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి నిష్పాక్షికమైన వ్యక్తులను నియమించాలి. సురేష్ బాబు, దిల్ రాజు కావాలనుకుంటే కమిటీలో ఎగ్జిబిటర్ల తరపున నిలబడి వాదించుకోవచ్చు. నిజమైన బి-ఫారమ్ లైసెన్స్ ఉన్న థియేటర్ ఓనర్స్ కాకుండా, లీజ్ ఓనర్లే ఇప్పుడు చక్రం తిప్పుతూ తమకు భారీ లాభాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆందోళన అందరిలోనూ ఉంది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.