
తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో సునీల్ ‘సంపత్ రావు’ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ తమ ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది.జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్టయిన ‘లూసిఫర్’, ‘ఎంపురాన్’ చిత్రాలకు రచయితగా పనిచేసిన మురళీ గోపి ఈ సినిమాకు కథ అందించడం విశేషం. మినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.
యాక్షన్ సన్నివేశాలతో పాటు, నేపథ్యంలో వినిపించే ఒక కవిత హీరో ఆర్య పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా ఉంది. విధికి, కుట్రలకు భయపడని ఒక తిరుగుబాటు నాయకుడిగా ఆర్య పాత్ర ఉండబోతున్నట్లు టీజర్ సూచిస్తోంది.ఈ చిత్రంలో ఆర్య, సునీల్‌తో పాటు రెజీనా కసాండ్రా, నిఖిల విమల్, ఇంద్రాన్స్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ఎస్ యువ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి
.