
Ram Charan vs Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమా రీ-రిలీజ్ కేరళలో సంచలన విజయాన్ని సాధిస్తోంది. 2006లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తాజాగా 4K వెర్షన్లో మళ్లీ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ విజయంతో అల్లు అర్జున్ను కేరళ అభిమానులు ఎందుకు ప్రేమగా "మల్లు అర్జున్" అని పిలుస్తారో మరోసారి నిరూపితమైంది. ఇటీవల కేరళలో విడుదలైన చాలా తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. రామ్ చరణ్ నటించిన పెద్ది, ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ వంటి భారీ చిత్రాలు కూడా అక్కడ రూ.1 కోటి మార్క్‌ను దాటలేకపోయాయి.
కానీ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన హ్యాపీ సినిమా రీ-రిలీజ్ రూపంలో వచ్చి కేవలం నాలుగు రోజుల్లోనే ఆ ఘనతను అందుకుంది. మొదటి మూడు రోజుల్లో హ్యాపీ 4K మొత్తం రూ.95.5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి రూ.35 లక్షలు, రెండో రోజు రూ.28 లక్షలు, మూడో రోజు రూ.32.5 లక్షలు రాబట్టింది.
నాలుగో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండటంతో సినిమా సులభంగా రూ.1 కోటి మార్క్‌ను దాటేసింది. ఈ కలెక్షన్లలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ పూర్తిగా మలయాళ వెర్షన్ ద్వారా రావడం. దీంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 2026లో కేరళలో విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా హ్యాపీ 4K నిలిచింది.
తొలి రోజు వసూళ్లు పెద్ది, ది రాజాసాబ్ చిత్రాల కంటే ఎక్కువగా నమోదయ్యాయని తెలుస్తోంది. కొచ్చి, తిరువనంతపురం సహా అనేక ప్రాంతాల్లో అభిమానులు ఈ రీ-రిలీజ్‌ను పండుగలా జరుపుకున్నారు. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, అభిమానుల సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ చిత్రంలో అల్లు అర్జున్, జెనీలియా
జంటగా నటించారు. విడుదలై రెండు దశాబ్దాలు గడిచినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కేరళ బాక్సాఫీస్ మరోసారి నిరూపించింది.