
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Farmers: తెలంగాణలో గత యాసంగి సీజన్లో ప్రభుత్వం రెండు విడతలుగా, ఒక్కొక్క రైతుకు గరిష్ఠంగా రెండెకరాల వరకు రైతు భరోసా సాయం అందించింది.
అయితే, మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండటంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఖరీఫ్ సీజన్ రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం.. పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అర్హుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి 6వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సీజన్‌కు ప్రభుత్వం సుమారు 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు 1,200 కోట్లు ఆదా అవుతాయని అంచనా. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా, 70 లక్షల
మంది రైతులకు పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి.
గతేడాది సాగు చేయని సుమారు 3.50లక్షల ఎకరాలను గుర్తించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామ పరిసరాల్లోని భూములు, రోడ్లు, కాలువల కిందికి వెళ్లిన భూములు కలిపి సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు పనికిరావని తేల్చారు. ఇటువంటి భూములకు సాయం ఇవ్వడం కంటే నిజమైన రైతులకు అందించడం వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్కొక్క రైతుకు గరిష్ఠంగా రెండెకరాల వరకు సాయం..
ఇప్పటివరకు పట్టా పాస్‌బుక్‌లో ఉన్న మొత్తం భూమికి సాయం అందించగా, ఇకపై ఐదు నుంచి ఏడున్నర ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రియల్ ఎస్టేట్, పడావు, బీడు భూములకు సైతం సాయం వెళ్లినట్లు గుర్తించిన వ్యవసాయ శాఖ.. వాటిని దశలవారీగా తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. పెద్ద భూస్వాములకు సాయం అందించడం కంటే చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఇలా చేస్తే వారికి ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు.
ప్రతి సీజన్‌కు ప్రభుత్వం సుమారు 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ..
యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాలకే సాయం అందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రైతు బంధు రెండు విడతలుగా సకాలంలో జమ అవగా, ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కొంతమంది ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. పెండింగ్ రైతు భరోసా త్వరగా విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని, లేకపోతే భవిష్యత్ స్థానిక ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.