
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న తితిదే ప్రొక్యూర్మెంట్ జీఎం ఉమాశంకర్, సీఎస్ఐఆర్ ప్రతినిధి. చిత్రంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తిరుపతి (తితిదే), న్యూస్టుడే: శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు తితిదే..
మైసూరుకు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో నిర్వహించిన రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (ఆర్ఐఎస్ఈ) సదస్సులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
తితిదే తరఫున ప్రొక్యూర్మెంట్ జీఎం ఉమాశంకర్ పాల్గొన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని, తయారీ సామర్థ్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవడంతో పాటు భక్తులకు విశ్వసనీయమైన సేవలు అందించే అవకాశం కలగనుంది. సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు తితిదే కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు