Razorpay IPO : ప్రస్తుతం దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా కోట్లల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూపీఐ సేవల్లోకి చాలా సంస్థలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి, ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ అయిన రేజర్‌పే తొలి పబ్లిక్ ఆఫర్‌కు వచ్చేందుకు ఇప్పుడు సిద్ధమైంది.
ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ పత్రాలను కాన్ఫిడెన్షియల్ రూట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI)కి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఐపీఓ ప్రయత్నాలను ప్రముఖ యూపీఐ సంస్థ ఫోన్‌పే చేసిన తర్వాత ఇప్పుడు ఇదే రంగం నుంచి రేజర్ పే వస్తుండడంతో మదుపరుల్లో ఆసక్తి నెలకొంది.
మరి ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ రేజర్ పే కంపెనీ సుమారు రూ.5000 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపినట్లు మీడియాల్లో వార్తలు వచ్చాయి.
ఇందుకు సంబంధించిన ప్రీ ఫైల్డ్ ముసాయిదా పత్రాలను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో, సెబీ వద్ద కంపెనీ ఫైల్ చేసినట్లు పేర్కొన్నాయి. ఈ ఐపీఓ ద్వారా ఎంత సమీకరించేది అనే విషయాన్ని కంపెనీ నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
2014లో హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ కలిసి ఫిన్‌టెక్ కంపెనీ రేజర్ పేను ప్రారంభించారు. డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ చెల్లింపుల సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. మరోవైపు.. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్ పే సైతం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది.
ఇప్పటికే మార్కెట్లలోకి రావాల్సి ఉండగా అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా తన పబ్లిక్ ఇష్యూను వాయిదా వేస్తూ వస్తోంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించేందుకు ఫోన్ పే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే రేజర్ పే ఐపీఓకు వస్తుండడం గమనార్హం. పోటీదారులకు మేలు చేకూర్చే సున్నిత సమాచారమేదీ బయటకు రాకుండా కంపెనీలు ఇలా కాన్ఫిడెన్షియల్ మార్గాలను ఎంచుకుంటాయని
మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సెబీ నుంచి అనుమతి పొందే వరకు ఆ వివరాలేవీ పబ్లిక్ డొమైన్‌లోకి రావు.