
వేములవాడ రూరల్ : జూన్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేశ్ (30) తాపీ మేస్త్రీగా పని చేస్తూ వేములవాడలో జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వేములవాడ శివారులోని జయవరం వద్ద అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రమేశ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు
.