India Bangladesh Border Standoff : అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన్‌కాచార్ సెక్టార్లో తీవ్ర దౌత్యపరమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉండే రక్షిత ప్రాంతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో గత ఆదివారం నుంచి తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు చిక్కుకుపోయారు.
తమ దేశానికి చెందిన ఈ పౌరులను తిరిగి వెనక్కి తీసుకోవడానికి బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం (బీజీబీ) సరుడుగా నిరాకరిస్తుండటంతో ఈ ఉద్రిక్తత మరింత రాజుకుంది. రెండు దేశాల మధ్య నలిగిపోతున్న ఈ బాధితుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ప్రతిష్టంభనగా మారిన ఫ్లాగ్ మీటింగ్..!సరిహద్దుల్లో తలెత్తిన ఈ తీవ్ర సమస్యను పరిష్కరించేందుకు భారత సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్), బంగ్లాదేశ్ దళాలు (బీజీబీ) అత్యవసరంగా ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించాయి.
అయితే ఈ సమావేశంలో బంగ్లాదేశ్ అధికారులు పట్టువీడకపోవడంతో ఎలాంటి సానుకూల పరిష్కారం లభించకుండానే చర్చలు ముగిశాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, వారిని స్వదేశానికి పంపేందుకు సోమవారం మరొక విడత సరిహద్దు ఉన్నతాధికారుల సమావేశం జరగనుందని బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి."నదిలో పారేసినా భారత్‌కు వెళ్లేది లేదు"..
వైరల్ వీడియో!ఇదిలా ఉండగా.. సరిహద్దు శూన్య బిందువు వద్ద చిక్కుకున్న బాధితులకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక వారు రోదిస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి.
అందులో ఒక బంగ్లాదేశ్ పౌరుడు మాట్లాడుతూ.. తాము బంగ్లాదేశ్ పౌరులమేనని, ఉపాధి కోసం భారత్‌కు వచ్చామని బహిరంగంగా అంగీకరించాడు. "మేము బంగ్లాదేశీయులమే అనడానికి మా వద్ద పక్కా ఆధారాలు, పత్రాలు ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడే చంపి నదిలో పారేసినా సరే..
మేము తిరిగి భారత దేశంలోకి అడుగు పెట్టే ప్రసక్తే లేదు. మా స్వదేశానికి వెళ్లడమే మాకు ముఖ్యం" అని ఆవేదనతో పేర్కొన్నారు. చొరబాట్లను అడ్డుకుంటున్న బలగాలు..ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న పలువురు చొరబాటుదారులను
బీఎస్ఎఫ్ దళాలు సమర్థవంతంగా వెనక్కి పంపించి వేస్తున్నాయి. గడచిన వారం రోజుల్లోనే అస్సాం పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 21 మంది చొరబాటుదారులను గుర్తించి సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హర్షం వ్యక్తం చేశారు. అక్రమ చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్న భద్రతా బలగాలను ఆయన ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు."సరిహద్దుల రక్షణ, భద్రతను బలోపేతం చేయడంలో అస్సాం పోలీస్, బీఎస్ఎఫ్ అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించాయి. 21 మంది చొరబాటుదారులను తక్షణమే గుర్తించి దేశంలోకి రాకుండా అడ్డుకున్నాయి. సరిహద్దుల భద్రత కోసం మా బహుముఖ వ్యూహం నిరంతరం కొనసాగుతుంది" అని సీఎం స్పష్టం చేశారు. అస్సాంతో పాటు అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్న పొరుగు రాష్ట్రాల సరిహద్దులను కూడా పటిష్టం చేసి, అక్రమ చొరబాట్లకు తావులేకుండా నిఘా ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు.