
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Chintamaneni Prabhakar News: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి పెను సంచలనంగా మారారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన తన అనుచరులతో కలిసి చేసిన హల్చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది.
సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి దిగడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏలూరు నగరంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ అనుచర గణంతో పాటు ఏకంగా బుల్డోజర్ (JCB) వెంటబెట్టుకుని లాయర్ శ్రీనివాసబాబు ఇంటి ముందుకు వెళ్లారు. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్నారనే విచక్షణ కూడా లేకుండా అర్ధరాత్రి వేళ అక్కడ బీభత్సం సృష్టించారు.
"వాడో నేనో తేలాలి.." అంటూ నడిరోడ్డుపై కేకలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని నడిరోడ్డుపై నిలబడి గట్టిగా అరుస్తూ, "వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా!" అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా తీవ్ర బెదిరింపులకు దిగారు. తాను ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మరిచిపోయి, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల సమక్షంలోనే ఈ రేంజ్ వార్నింగ్‌లు ఇవ్వడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
నడిరోడ్డుపై సాగుతున్న ఈ హైడ్రామాను ఆపేందుకు చింతమనేని కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. "వద్దు నాన్న ప్లీజ్.. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం" అంటూ ఆయన కుమార్తె తండ్రిని
పట్టుకుని ఎంత బతిమాలినా ఎమ్మెల్యే శాంతించలేదు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన డీఎస్పీపై కూడా చింతమనేని తీవ్రంగా విరుచుకుపడ్డారు. "నన్ను ఆపుతారేంటి?" అంటూ పోలీసులతోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఏలూరు వీధుల్లో ఈ పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం కొనసాగింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ చింతమనేని.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాంటి అరాచకాలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన తీరు పలుమార్లు తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఒక మహిళా తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని తన అనుచరులతో కలిసి దాడి చేసిన ఉదంతం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ప్రభుత్వ అధికారులను బెదిరించడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. గతంలోనూ పోలీసులను నిలదీయడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, కుల దూషణల కేసుల్లో ఇరుక్కోవడం వంటి అనేక సంఘటనలతో ఆయన నిరంతరం వార్తల్లో నిలిచారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పలు వివాదాల్లో ఇరుక్కున్న చింతమనేని, ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తన పాత పద్ధతిని మార్చుకోలేదని ఈ ఘటనతో స్పష్టమవుతోంది. అదీ సొంత పార్టీ నేత ఇల్లే లక్ష్యంగా, అదీ పొక్లెయిన్లతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆయన చేసిన వీరంగంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.