
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Ind W vs Pak W World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన గ్రూప్-ఎ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 64 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. టోర్నీని ఘన విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు రాబట్టింది.
ఆ తర్వాత 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 17 ఓవర్లలో ఆలౌట్ అయ్యి.. 106 పరుగులతో సరిపెట్టుకోగా.. 64 పరుగులతో తేడాతో టీమ్ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. మంధాన హాఫ్ సెంచరీ.. రిచా ఘోష్ మెరుపులు! టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి.
ఓపెనర్ షెఫాలీ వర్మ (6), వన్‌డౌన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ (1) త్వరగా అవుట్ కావడంతో భారత్ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిలబెట్టారు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. హర్మన్‌ప్రీత్ 35 బంతుల్లో 36 పరుగులు
చేయగా.. స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి పాక్ బౌలర్లపై విరుచుకుపడింది.
స్మృతి అవుటైన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు రాబట్టి స్కోరు వేగాన్ని పెంచింది. ఆఖర్లో దీప్తి శర్మ (12 నాటౌట్) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలింగ్ దళంలోని ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ తలో 2 వికెట్లు తీశారు.
దీప్తి శర్మ వికెట్ల మాయాజాలం.. 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మునీబా అలీ (41), గుల్ ఫిరోజా కలిసి పవర్‌ప్లేలో 38 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ పవర్‌ప్లే ముగిసిన వెంటనే భారత స్పిన్నర్లు పాక్ పతనాన్ని శాసించారు.
సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా ముక్కలు చేసింది. గుల్ ఫిరోజా, ఆయేషా జాఫర్, అలీయా రియాజ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్లను దీప్తి పెవిలియన్‌కు పంపింది.
మరోవైపు యువ స్పిన్నర్ శ్రీ చరణి కూడా పాక్ బ్యాటర్లను తిప్పలు పెట్టింది. ఆమె 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (సైరా జబీన్, నతాలియా పర్వైజ్, రమీన్ షమీమ్) ఖాతాలో వేసుకుంది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనాను షెఫాలీ వర్మ డకౌట్ చేసింది. మిడిలార్డర్లో అలీయా రియాజ్ (18) మినహా ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. దీంతో పాకిస్తాన్ 17 ఓవర్లలోనే 106 పరుగులకే ఆలౌట్ అయింది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై లభించిన ఈ తిరుగులేని ఆల్ రౌండ్ విజయంతో టీమిండియా ఉమెన్స్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. నెట్ రన్ రేట్ పరంగా కూడా భారత్‌కు ఇది పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. రాబోయే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ భారత మహిళల జట్టు ఇదే జోరును కొనసాగించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.