
ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల అనేక రాశులు లబ్ధి పొందనున్నాయి. అయితే అయిదు రాశుల వారికి మాత్రం అక్టోబర్ 31 వరకు కొద్దిపాటి కష్టనష్టాలు తప్పకపోవచ్చు. ఈ రాశులకు గురువు దుస్థానంలో ఉచ్ఛపట్టడమే అందుకు కారణం. వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి కొద్దిగా ఆదాయ నష్టం, గౌరవ భంగం, అవమానాలు, వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఆశాభంగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. గురువు వల్ల కలిగే కష్టాల నుంచి బయటపడాలన్నా, గురువు మరింత మేలు చేయాలన్నా అన్ని రాశుల వారు దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి వంటి గురువులను ఎక్కువగా ప్రార్థించడం మంచిది. వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయం పెరిగినా చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలగకపో వచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఆశాభంగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల వృథా ఖర్చులు, విలాసాల మీద ఖర్చులు, మిత్రుల మీద ఖర్చులు, విందు వినోదాల మీద ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేయడం జరుగుతుంది. ఆర్థిక విషయాల నిర్వహణ బాగా లోపభూయిష్ఠంగా ఉంటుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగి అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. శ్రమాధిక్యత పెరుగుతుంది. తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం పట్టినప్పటికీ ఈ రాశివారు ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఊహించని కష్టనష్టాలను అనుభవించే అవకాశం ఉంది. కుటుంబ
జీవితంలో కలతలు రేగే అవకాశం ఉంది. కొందరు బంధువులు దుష్ప్రచారం సాగించడం జరుగుతుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు చివరి క్షణంలో ఆగిపోయే సూచనలున్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో జూనియర్లకు పదోన్నతులు లభించే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన ఉద్యోగం లభించకపోవచ్చు. ఆదాయం వృద్ధి చెందినప్పటికీ, అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. మాటకు, చేతకు బాగా విలువ తగ్గుతుంది.
కుంభం: ఈ రాశికి షష్ట స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఆదాయం పెరిగినప్పటికీ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సరిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే లేదా మోసపోయే అవకాశం ఉంది. మిత్రులు నమ్మక ద్రోహానికి పాల్పడతారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.