
శిఖా, సౌరభ్ 2020లో ఎంతో ఆనందంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య ప్రారంభమైన వారి వైవాహిక జీవితం కొంతకాలానికే విభేదాలతో నిండిపోయింది. చిన్నచిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారాయి. పరిస్థితులు మరింత దిగజారడంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఒకప్పుడు కలిసి జీవించిన ఈ జంట, తర్వాత కోర్టులో ప్రత్యర్థులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడాకుల కేసు ఏకంగా ఐదేళ్ల పాటు సాగింది. విచారణలు, న్యాయవాదుల వాదనలు, కోర్టు ఖర్చులు.. ఇలా ఈ పోరాటం అందరికీ మానసికంగా, ఆర్థికంగా భారంగా మారింది. ముఖ్యంగా శిఖా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన, కోర్టు ఖర్చులు కలిపి ఆమె తండ్రిని తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. తన పొదుపు మొత్తాన్ని కూడా ఈ వ్యవహారంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో శిఖా తండ్రికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సౌరభ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తనతో కేసు నడుస్తున్నప్పటికీ, మామగారి ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా భావించాడు. వెంటనే ఆయనను గురుగ్రామ్‌లోని మెరుగైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశాడు. సమయానికి చికిత్స అందడంతో శిఖా తండ్రి కోలుకున్నారు. సౌరభ్ చేసిన ఈ మానవతా సహాయం శిఖా మనసులో ఏదో మార్పు తీసుకొచ్చింది. తర్వాతి రోజు మరోసారి విడాకుల కేసు విచారణ కోసం ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. ఎప్పటిలాగే న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కొంతసేపటి తర్వాత న్యాయమూర్తి సౌరభ్‌ను చూసి, "ఇప్పటికీ మీకు విడాకులు కావాలనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సౌరభ్ శిఖా వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ ఒక్క చూపు శిఖా హృదయాన్ని కదిలించింది. సంవత్సరాలుగా తనలో పేరుకుపోయిన కోపం, బాధ, అపార్థాలు ఒక్కసారిగా కరిగిపోయాయి. భావోద్వేగాన్ని
ఆపుకోలేకపోయిన శిఖా తన చేతిలో ఉన్న విడాకుల పత్రాలను అక్కడికక్కడే చించేసింది. వెంటనే సౌరభ్ దగ్గరకు వెళ్లి అతడిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ క్షణంలో కోర్టు హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇద్దరి కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. విడిపోవడానికి వచ్చిన వారు మళ్లీ కలిసిపోయారు. ఐదేళ్లుగా సాగిన న్యాయపోరాటం క్షణాల్లో ముగిసిపోయింది. ఈ ఘటన అక్కడున్న వారందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ప్రేమ, అనుబంధం, మానవత్వం ఉన్న చోట కోపం, అహం ఎక్కువ కాలం నిలవలేవని మరోసారి నిరూపించింది. కొన్నిసార్లు ఒక చిన్న సహాయం, ఒక మంచి మనసు.. జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని ఈ సంఘటన చూపించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.