
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shabbir ali react on aicc disciplinary committee notice: తెలంగాణలో కొంత మంది నేతల తీరు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చి పెడుతుంది. ఇటీవల సీనియర్ నేతలు, మంత్రులు సైతం గీత దాటి మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం విధానాలు, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పదవులు విషయంలో వీరు మాట్లాడుతున్న తీరు చాలా సందర్బాల్లో అపోసిషన్ పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్న ఒక ఆడియో కాల్ తెగ వైరల్ అవుతుంది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహమ్మద్ షబ్బీర్ అలీ ఇటీవల ఒక ఫోన్ కాల్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ లో డబ్బులకే పదవులు అమ్ముకుంటున్నారని, మహిళలపై కూడా నీచంగా వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఆడియో కాల్ లో వాయిస్ ఉంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనిపై సీరియస్ అయ్యారు. వెంటనే సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై మహమ్మద్ షబ్బీర్ అలీ తాజాగా.. ఒక లేఖను విడుదల చేశారు. తనపై వచ్చిన ఆడియో క్లిప్ ఆరోపణలను మహమ్మద్ షబ్బీర్ అలీ పూర్తిగా ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు, మహిళా నాయకులు లేదా కాంగ్రెస్ కార్యకర్తలపై తాను ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వివాదానికి కారణమైన 54 సెకన్ల ఆడియో క్లిప్‌ను "TeluguScribe" అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా 10
జూన్ 2026న ప్రచురించిందని తెలిపారు. ఇది కావాలని తన పరువును, పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు చేసిన కుట్రగా అభివర్ణించారు.
ఆ ఆడియో క్లిప్ నిజమైనదని నిర్ధారించే ఆధారాలు లేవని చెప్పారు. అది మొత్తంగా ఒక ఫెక్ క్లిప్ అని, మార్ఫింగ్ చేసినదని పేర్కొన్నారు. దాన్ని కృత్రిమ మేధ (AI) సహాయంతో రూపొందించినదై ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఆడియోపై ఫోరెన్సిక్ పరీక్షలు జరగకముందు ఆ ఆడియో ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఆ క్లిప్‌ను సృష్టించిన, ప్రచారం చేసిన వ్యక్తులు, వేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా పోలీసులకు ఈ అంశంపై అధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అసలు ఆడియో ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలన చేయాలని పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపులు, మీడియా సంస్థలు, నిర్వాహకుల పాత్రపై కూడా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా.. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఉద్దేష్య పూర్వ ప్రణాళికతో కూడిన కుట్ర జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరిన కొంతమంది నాయకులు పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సంఘటనల వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాన్ని సైతం షబ్బీర్ అలీ వ్యక్తం చేశారు. దాదాపు 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని గుర్తుచేశారు. 1989, 2004లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో తనకు దాదాపు నాలుగు దశాబ్దాల సన్నిహిత సంబంధం ఉందని పేర్కొన్నారు. ఆయనపై తాను ఆరోపణలు చేసే ప్రసక్తే లేదని, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేశారు.
Read more: BRS KTR: సీఎం రేవంత్ రెడ్డి ఫస్టాఫ్ పాలన అట్టర్ ఫ్లాప్.. కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఏమన్నారంటే..?
ఈ ప్రచారం వల్ల తన వ్యక్తిగత, సామాజిక, రాజకీయ ప్రతిష్ఠకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫెక్ ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం కేసులతో సహా క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ లేఖను తన అధికారిక వివరణగా పరిగణించాలని క్రమశిక్షణా సంఘాన్ని కోరారు. చివరగా, తాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, క్రమశిక్షణ, విలువలకు కట్టుబడి ఉంటానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.