ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పోస్టుల భర్తీ వ్యవహారం గతకొన్ని రోజులుగా చర్చనీయాంశమైంది. డీఎస్సీ పోస్టుల భర్తీపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేస్తోంది. పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవటం.. వారికి న్యాయ సహాయం అందిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పోస్టుల నియామకాలపై వైసీపీ పలు ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఏపీ విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నప్పటికీ ఈ వివాదం చల్లారటం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టెట్ రాకపోయినా కూడా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పోస్టులు ఇచ్చారంటూ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా డీఎస్సీ 2025 నియామకాలపై పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. ఉన్నతాధికారులు ప్రతి అంశంపై వివరణలు ఇచ్చినా మళ్లీ మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. తాజాగా కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారాన్ని మొదలెట్టారని.. బాధ్యతగల పదవులు నిర్వహించిన వ్యక్తులే దీనికి పాల్పడటం దురదృష్టకరమని అభిప్రాయపడింది.2025 డీఎస్సీలో మొత్తం 15,941 మందిని ఉపాధ్యాయులుగా నియమించగా.. అందులో మహిళలు 7,955 మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. మాజీ సైనికులు 112 మంది, PwBD (దివ్యాంగులు)లలో OH కోటా కింద 190 మంది, VH కోటా కింద 158 మంది, HI కోటా కింద 119 మంది, MI కోటా కింద 24 మంది నియమితులైనట్లు వెల్లడించింది. స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన 372 మందిలో.. బీసీలు 50%, ఎస్సీలు 30 %
, ఎస్టీలు 8%, ఓసీలు 12 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈ 12 శాతం మంది ఓసీలలో కమ్మ కులానికి చెందినవారు కేవలం 9 మంది మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ కోటాలో కాపులు 16 మంది, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 10 మంది ఉన్నారని తెలిపింది.వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లింల నుంచి ఒకరు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. BC-A నుంచి 2,088 మంది, BC- Bలో 2,680 మంది, BC - C లో248 మంది, BC-Dలో 2,610 మంది, BC-Eలో 1,067 మంది అభ్యర్థులు నియమితులైనట్లు వెల్లడించింది. ఓసీ సామాజికవర్గం నుంచి 3,192 మంది.. SC GR1 లో 145 మంది, SC GR 2లో 1,345 మంది, SC GR 3లో 1,555 మంది నియమితులైనట్లు తెలిపింది. ఎస్టీ సామాజికవర్గానికి సంబంధించి 1,011 మంది నియమితులైనట్లు వివరించింది.పూర్తి అర్హతతో, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపికై, వృత్తిలో తమ ప్రతిభను చూపిస్తున్న ఉపాధ్యాయులపై తప్పుడు ప్రచారం చేస్తూ.. వారి మానసిక పరిస్థితిని దెబ్బతీయడం సరికాదని సూచించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దన్న ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.