
ప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే కలయికని విశ్లేకులు చెపుతారు. పాకిస్థాన్‌తో అంటకాగే చైనా ఇండియాని ప్రత్యర్థిగా కాక భాగస్వామిగా చూస్తామని చెప్పడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్, చైనా విషయాల్లో మాస్కో జోక్యం చేసుకోబోదని వెల్లడించడం .. తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే ప్రకటనలే తప్ప దేశాల మధ్య గొప్ప సయోధ్య కుదరడం కాదంటారు పరిశీలికులు. రష్యా, భారత్, చైనాల ప్రాధాన్యం ప్రపంచంలో గత కొలంగా మరింత పెరుగుతోంది. ప్రపంచంలో పశ్చిమ దేశాల ప్రభావం, శిక్షణాత్మక ఆంక్షలు, సరఫరా ఒప్పందాలు, ప్రాంతీయ యుద్ధాల అనిశ్చితితో పెద్ద యూరేషియన్ శక్తులు తమ స్థానం ఎక్కడా అని లెక్కలు వేసుకుంటున్నాయి. ఆ క్రమంలో ఆర్ఐసీ కేవలం అమెరికా వ్యతిరేక పక్షంగా కాకుండా.. వాస్తవానికి, విభేదాల మధ్య సంప్రదింపుల వేదికగా ఉపయోగపడే అవకాశంగా అవతరిస్తోంది. అమెరికా, క్వాడ్, బ్రిక్స్, ఎసీఓ, రష్యా, చైనాలతో ఒకేసారి సంబంధాలు నెరపాల్సిన పరిస్థితుల్లో భారత్‌కు ఆర్ఐసీ వేదిక ప్రాధానమవుతోంది. ఇక్కడే భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి పరీక్షలు తప్పడం లేదు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్, భారత్, చైనా పరస్పర సంబంధాలను ప్రత్యర్థులుగా కాక భాగస్వాములుగా చూడాలనీ.. ఒకరి అభివృద్ధి మరొకరికి అవకాశం కావాలని చెప్పారు. ఇదే సందర్భంగా బీజింగ్ రెండు దేశాల సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందనీ, సమాచార మార్గాలు సాఫీగా పనిచేస్తున్నాయని శాంతి వచనాలు చెప్పింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం భారత్, చైనా సమస్యలను వాళ్లే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, మాస్కో జోక్యం చేసుకోబోదని చెప్పారు. అంటే మధ్యవర్తి పాత్ర పోషించకుండా.. భారత్, చైనాల ఉద్రికత్తకు దూరంగా రెండు దేశాలతో సంబంధాలు కొనసాగించడానికి అనుసరిస్తున్న దౌత్య వ్యూహమే అని స్పష్టమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్
12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరు ఖరారైందని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ఆర్ఐసీ చర్చలకు వేదికగా మారే సూచనలు ఉన్నా.. బ్రిక్స్, ఆర్ఐసీ రెండూ ఒకటి కాదు. బ్రిక్స్ విస్తృత గ్లోబల్ సౌత్ వేదిక, ఆర్ఐసీ మాత్రం మరింత డెలికేట్ మిత్రత్రయం.
2024లో కజాన్ బ్రిక్స్ సమ్మిట్ తర్వాత బ్రిక్స్ అంతర్జాతీయ వేదికగా ప్రభావితం చేసే స్థాయికి ఎదిగినప్పటికీ.. భారత్, చైనా సరిహద్దు సమస్యలు, భారత్, పాకిస్థాన్ సంబంధాలు, రష్యా, చైనా సమీకరణలు ఆయ దేశాల పంధాలతోనే సాగుతున్నాయి. భారత్, చైనా సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నది ప్రకటనలకే పరిమిమవుతోంది. భారత్, చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయ ఘటనల తర్వాత పరిణామాలు దానికి అద్దంపడుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగక పోయినా.. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మాత్రం వేగంగా పెరుగుతోంది. 2025లో భారత్, చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 155.6 బిలియన్ డాలర్లకు చేరిందని చైనా రాయబారి పేర్కొనడం గమనార్హం.
భారత్, చైనా, రష్యాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటామంటున్న రష్యా మాటలే నిరూపిస్తున్నాయి. రష్యా, చైనాతో తన సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తూనే, భారత్‌తో పాత రక్షణ, ఇంధన, వ్యూహాత్మక బంధాన్ని వదులుకోవడం లేదు. అలాగని రష్యా తటస్థంగా ఏమీ వ్యవహరించడం లేదు. నిజానికి, మాస్కో తన స్వప్రయోజనాలను కాపాడుకుంటూ, బిక్స్, ఎస్‌సీఎ, ఆర్ఐసీల ద్వారా గ్లోబల్ పవర్ ఏ ఒకరి చేతిలో ఉండకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజనీతి ప్రదర్శిస్తోంది.
ఆర్ఐసీకి 1990లలో ప్రాధాన్యత పెరిగింది. కానీ అది ఎప్పటికీ నాటో తరహా కట్టుదిట్టమైన కూటమి కాలేదన్నది వాస్తవం. భారత్, చైనాల మధ్య విశ్వాస లేమి, చైనా, పాకిస్థాన్ సన్నిహిత్యం, భారత్, అమెరికాల సాన్నిహిత్యం, రష్యా విచ్చిన్నం వంటి అంశాలు దానికి కారణంగా చెప్తారు. అందుకే త్రిసభ్య కూటమి బలపడుతుంది అనేది ఎండమావి లాంటిదే. భారతదేశంలో జరిగే చర్చల్లో ఒక పక్షం ఆర్ఐసీని పశ్చిమానికి ప్రత్యామ్నాయ వ్యూహంగా చూస్తుంది. మరో పక్షం చైనాతో ఏ దగ్గరితనం అయినా సరిహద్దు, వాణిజ్య అసమానత, భద్రతా ఆందోళనల దృష్ట్యా అనుమానంతో చూస్తుంది. ఈ రెండు వాదనలలోనూ నిజం ఉంది. ప్రజాస్వామ్య దేశంగా భారత్‌కు దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనం అవసరం. అందుకే ఈ వ్యూహాత్మక దౌత్యం కొనసాగిస్తుంది.
భారతదేశపు 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యం!
.