
చిత్ర పరిశ్రమలో ఏ నటికైనా క్రేజ్ ఉన్నంతవరకే డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ ట్రాక్ ఎక్కి, పాపులారిటీ అమాంతం పెరిగిపోతే ఆటోమేటిగ్గా పారితోషికం కూడా ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా సరిగ్గా ఇదే పని చేస్తోంది. ఇటీవల సూర్య సరసన నటించిన ‘కరుప్పు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ 43 ఏళ్ల బ్యూటీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ క్రేజ్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ సీనియర్ భామ. తాజాగా ఓ పెద్ద సినిమాలో త్రిషను హీరోయిన్గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సంప్రదించగా.. వారికి ఊహించని షాక్ తగిలింది. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఆ సినిమాలో నటించేందుకు త్రిష ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. హీరోయిన్ల విషయంలో ఈ స్థాయి రెమ్యునరేషన్ వినడం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలకు పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. త్రిష అడిగిన అంత భారీ మొత్తాన్ని చూసి సదరు నిర్మాత ఒక్కసారిగా అవాక్కయ్యారట. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు త్రిషను కనీసం రూ. 10 కోట్ల రూపాయల బడ్జెట్ పరిధిలోకి ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి త్రిష దాదాపు రూ. 4 కోట్ల వరకు తీసుకోగా ‘కరుప్పు’ సినిమా సక్సెస్ తర్వాత త్రిష రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార రికార్డు సృష్టించగా.. ఇప్పుడు త్రిష డిమాండ్ చూస్తుంటే ఆ రికార్డును కూడా దాటేసేలా కనిపిస్తోంది. మరి ఈ 15 కోట్ల డీల్‌కు నిర్మాతలు ఓకే చెప్తారో లేదో చూడాలి!