RBI Rate Hike: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు నెలలు అవుతోంది. యుద్ధం ప్రారంభం నాటి నుంచే ద్రవ్యోల్బణ భయాలు ముసురుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రభావం నేరుగా కనిపిస్తోంది. ఆహారం, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో పాటు ఎల్నినో మరింత ప్రభావం చూపనుంది. దేశంలో ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పటికే మండిపోతున్న ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావంతో 2026- 27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరే అవకాశం ఉన్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్బీఐ వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చని అభిప్రాయపడింది. కాగా ప్రస్తుతం 5.25 శాతం వద్ద రెపో రేటు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని మరో 75 బేసిస్ పాయింట్లు పెంచితే 6 శాతానికి చేరవచ్చు. దీంతో పాటు బ్యాంకులో సైతం రుణాల వడ్డీ రేట్లను పెంచుతాయి. ఆ ప్రభావం రుణాలు తీసుకున్నవారిపై పడుతుంది. నెలవారీ రుణ బకాయిలు ఈఎంఐల భారం పెరుగుతుంది. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ తన రిపోర్ట్ లో పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ ఏప్రిల్ నెలలో 3.48 శాతంగా ఉండగా అది మే నెలలో 3.94 శాతానికి పెరిగింది. ఈ ఏడాది 2026లో 10 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లయితే చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి తగ్గుముఖం పట్టి నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపిస్తుంది. దీంత ఆహార పదార్థాల ద్రవ్యోల్బణాన్ని మరింత ఎదుర్కోవలసి వస్తుందని నివేదిక హెచ్చరించింది. ద్రవ్యోల్బణం
అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు వడ్డీ రేట్లను 50- 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చని అంచనా వేసింది. వర్షపాతం పైనే ఆహార పదార్థాల ధరలు ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచితే రుణ గ్రహీతలపై అదనపు భారం పడుతుంది. లోన్ వడ్డీ రేట్లు ఒక్కసారిగా పెరుగుతాయి. నెల వారీ ఈఎంఐలు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. అయితే, డిపాజిట్ల వడ్డీ రేట్లు సైతం పెరుగుతాయి.