
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో షేక్ హ్యాండ్ అంశం మరోసారి చర్చకొచ్చింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత టోర్నీల్లో ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. దీంతో ఈసారి ఏమవుతుందనేది ఉత్కంఠగా మారింది. ఇదే ప్రశ్నను భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎదుట విలేకర్లు ఉంచారు. ఆమె దానికి స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘మేం ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మనం ఆట గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా.. మరే ఇతర అంశాలపై మాట్లాడం. నేను కూడా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ఇతర జట్లతో ఎలా ఆడతామో.. అలాగే పాకిస్థాన్‌తోనూ తలపడతాం. వందశాతం విజయం కోసం ప్రయత్నిస్తాం’’ అని హర్మన్ తెలిపింది. ‘‘మాపై ఒత్తిడి లేదని చెప్పను. తప్పకుండా ఉంటుంది. నేను క్రికెట్‌ను చూడటం మొదలు పెట్టినప్పటి నుంచి.. సపోర్టర్‌గానూ ఒత్తిడిని ఫీలయ్యా. ఇప్పుడు మేం ఆడుతున్నాం. కాబట్టి, మాపై ఇంకాస్త అదనంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే, మేం అదృష్టవంతులమని చెబుతా. ఇలాంటి పెద్ద మ్యాచుల్లో ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. ఆటను ఆస్వాదిస్తూనే విజయం సాధిస్తాం’’ అని హర్మన్ స్పష్టం చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.