
జగిత్యాల : కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నపూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి ధర్మపురి మండలం నెరేళ్ళకు చెందిన ప్రదీప్ కుమార్ తన కుమార్తె పుష్పలత, మల్లేష్‌తో కలిసి కారులో వస్తుండగా, కొండగట్టు నుండి ధర్మపురి వైపు అతివేగంగా వస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రదీప్ కుమార్, పుష్పలత, మల్లేష్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108 సహాయంతో దవాఖానకు తరలించారు. అందులో పుష్పలత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది
.