
పూర్తిగా కాలిపోయిన యాక్సిస్ బ్యాంకు ఏటీఎం, పక్క గదిలో పాక్షికంగా దెబ్బతిన్న యూనియన్ బ్యాంకు ఏటీఎం విశాఖపట్నం(వేపగుంట), న్యూస్‌టుడే: విశాఖలోని ఓ భవనంలో ఉన్న ఏటీఎం గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద విషయం ఆ భవనంలో ఉన్నవారికి తెలియలేదు. కానీ, ఎక్కడో ముంబయిలో ఉన్న ఏటీఎంలను పర్యవేక్షించే సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ (సీఎంయూ)కు ప్రమాద సంకేతం అందడంతో వారు అప్రమత్తమయ్యారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంట్ల అప్పారావు అనే వ్యక్తికి నగరంలోని వేపగుంట రామాలయం సమీపంలో మూడంతస్తుల భవనం ఉంది. కింద మూడు దుకాణాలుండగా, వాటిలో రెండింటిని యాక్సిస్, యూనియన్ బ్యాంకుల ఏటీఎంలకు, మరొకటి ఫొటో స్టూడియోకు అద్దెకిచ్చారు.
శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో మంటలు చెలరేగాయి. వెంటనే ముంబయిలోని ఏటీఎంలను పర్యవేక్షించే సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌కు ప్రమాద సంకేతం అందింది. అక్కడి వారు విశాఖలోని బ్యాంకు మేనేజర్‌ను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపే యాక్సిస్ బ్యాంకు ఏటీఎం మొత్తం దగ్ధమైంది. యూనియన్ బ్యాంకు ఏటీఎం పైభాగం, విద్యుత్తు వైర్లు కాలిపోయాయి. పెందుర్తి సీఐ సతీశ్‌కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. ప్రమాద సమయానికి ఏటీఎంలో రూ.30 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.