తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాల పండుగకు ఏడాది పొడవునా ఎన్నో ప్రత్యేకమైన సీజన్లు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రథమార్ధంలో సంక్రాంతి, వేసవి కానుకలుగా వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే.. ద్వితీయార్ధంలో మాత్రం దసరా సీజన్ అత్యంత కీలకంగా మారుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు, కుటుంబ ప్రేక్షకులకు సుదీర్ఘమైన సెలవులు దొరికే సమయం కావడంతో, పరిశ్రమ వర్గాలు దీనిని ఒక ‘మినీ సంక్రాంతి’లా భావిస్తుంటాయి. అందుకే కనీసం మూడు నాలుగు పెద్ద సినిమాలు ఈ పండుగ రేసులో నిలవడం ఏటా చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఏడాది దసరా బరి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు అగ్ర కథానాయకులు తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో ఈ విజయదశమి రేసులో తలపడేందుకు సిద్ధమవుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య విధ్వంసంనటసింహం నందమూరి బాలకృష్ణ సైతం తన 111వ చిత్రంతో బాక్సాఫీస్ బరిని షేక్ చేయడానికి లైన్ లో ఉన్నారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా ప్రారంభమైన రోజు నుంచే దీనిని విజయదశమి కానుకగా విడుదల చేయాలనే ప్రచారం గట్టిగా సాగింది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త స్టైలిష్ మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఇటీవలే విడుదలైన పవర్ఫుల్ గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. థియేటర్లలో ఆయన సృష్టించే యాక్షన్ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.దసరా బుల్లోడిగా వస్తున్న వెంకీగడిచిన మూడేళ్లుగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుసగా సంక్రాంతి పండుగ సమయాల్లోనే థియేటర్లలో సందడి చేస్తూ వచ్చారు. గతేడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో పాటు, ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్
షేర్ చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో బ్యాక్-టు-బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే జోష్‌తో ఈసారి సరికొత్తగా దసరా బరిలో నిలిచేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారి వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’ (ఏకే 47). పూర్తి స్థాయి కుటుంబ విలువల నేపథ్యంలో, భావోద్వేగాలు మరియు వినోదంతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ మూడో వారంలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ‘కింగ్ 100’ మైల్స్టోన్ మూవీమరోవైపు కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ ప్రాజెక్ట్ కోసం వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు రా కార్తీక్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మైల్స్టోన్ మూవీ ఇప్పటికే చివరి షెడ్యూల్స్కు చేరుకుంది. ఎలాగైనా ఆగస్టు నాటికి గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి దసరా పండుగ రేసులోనే సినిమాను నిలబెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మునుపెన్నడూ చూడని సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున భిన్నమైన షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.మెగాస్టార్ ‘ విశ్వంభర ’ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సామాజిక ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. ఒకవేళ ఆగస్టు లోపు గ్రాఫిక్స్ పనులన్నీ ఒక కొలిక్కి వస్తే, ఈ చిత్రాన్ని కూడా దసరా రేసులోకి తెచ్చే ఆలోచనలో సినీ వర్గాలు ఉన్నాయి. రేసులో నాని, సాయి దుర్గాతేజ్ కూడా వీరితో పాటు న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న రా అండ్ రస్టిక్ పీరియాడిక్ డ్రామా ‘ది ప్యారడైజ్’ వాస్తవానికి ఆగస్టు చివరి వారంలో రావాల్సి ఉంది. అయితే ఇంకా కీలకమైన షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమా కూడా సెప్టెంబర్ లేదా దసరా సీజన్‌కు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం కూడా చివరి దశకు చేరుకోవడంతో ఈ పండుగ సీజన్ పైనే కన్నేసింది. మొత్తానికి ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ స్టార్స్ మధ్య జరిగే ఈ మహా సమరం ప్రేక్షకులకు అసలైన వినోదాల పండుగను పంచడం ఖాయంగా కనిపిస్తోంది.