‘ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారదు.. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది’.. జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు. విడిపోయిన జంటలు కూడా ఒక్క సంఘటనతో మళ్లీ ఏకమవుతాయోమో? ఎవరు చెప్పగలరు. అవును, ఓ జంట విషయంలో ఇలాగే జరిగింది. విడాకుల కోసం కోర్టుకెక్కి దంపతుల కథ అనుకోని సంఘటనతో చివరకు సుఖాంతమైంది. పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పుట్టింటికి వచ్చేసిన భార్య.. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. తన కుమార్తె కేసు కోసం ఆమె తండ్రి తన వద్ద ఉన్న మొత్తం అంతా ఖర్చుచేశాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆరోగ్యం క్షీణించింది. చివరకు వైద్యం చేయించుకోడానికి కూడా వారికి కష్టమైంది.ఓవైపు కుమార్తె భవిష్యత్తు, ఇంకోవైపు ఖర్చులకు డబ్బులు సమకూర్చలేక ఇబ్బందులు ఆ తండ్రిని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. గుండెపోటు రావడంతో డబ్బులు లేక చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు. తన తండ్రిని ఆ స్థితిలో చూసి కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే, ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. తన మామగారు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి ఆమె భర్త పరుగెత్తుకొచ్చారు. ఆయనను అక్కడ నుంచి ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కొద్ది రోజుల తర్వాత ఆయన కోలుకుని, ఆరోగ్యంగా తిరిగొచ్చారు. ఇది జరిగిన అనంతరం విడాకుల కేసు విచారణ కోసం కోర్టుకు హాజరైన భార్య.. పత్రాలన్నింటినీ చించి పడేసి, తన భర్తను ఆలింగనం చేసుకుని, కన్నీటిపర్యంతమైంది. తనను క్షమించమని భర్తను సదరు భార్య వేడుకుంది. ఢిల్లీకి చెందిన శిఖ సింగ్, సౌరభ్‌ల విడాకులకు హ్యాపీ ఎండింగ్ పడి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన శిఖ సింగ్ , సౌరభ్లకు 2020లో వివాహం జరిగింది. పెళ్లైన
కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో సౌరభ్‌పై శిఖ వరకట్న వేధింపుల కేసు పెట్టింది. శిఖ సింగ్ తండ్రి తన దగ్గరున్నదంతా లాయర్ల ఫీజు, కోర్టు చుట్టూ తిరగడం కోసం ఖర్చుచేశాడు. ఈ ఒత్తిడిలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి, కనీసం చికిత్స చేయించుకోవడానికి కూడా ఆయన వద్ద డబ్బు లేకుండా పోయింది. ఒకవైపు కూతురు కాపురం కూలిపోతుందనే బాధ, ఇంకోవైపు ఆర్థిక పరిస్థితి ఆయనను మరింత కుంగదీశాయి. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. నిజానికి ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లే స్థోమత లేకపోవడంతో తన తండ్రి బతుకుతాడో? లేడోనని శిఖ ఏడుస్తూనే ఉందిశిఖ భర్త సౌరభ్‌కు ఈ విషయం తెలియగానే వెంటనే ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. తన మామను అక్కడి నుంచి గురుగావ్‌లోని అతిపెద్ద ఆసుపత్రి అయిన 'మేదాంత గ్రూప్' ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. శిఖ తండ్రి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ కోర్టులో విడాకుల కేసు తదుపరి విచారణకు శిఖ హాజరుకావాల్సి వచ్చింది. కానీ, కోర్టుకు చేరుకోగానే, ఆమె విడాకుల పత్రాలను ముక్కలు ముక్కలుగా చింపేసి, తన భర్తను కావలించుకుని ఏడ్చేసింది. ఎవరో సెల్ ఫోన్లో తీసిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్నచిన్న కారణాలతో విడిపోతున్న జంటలకు ఇదొక ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం ఆమె దగ్గర డబ్బులు లేవు కాబట్టి భర్తతో కలిసిపోయిందని లేకుంటే కేసు గెలిచి భరణం దక్కించుకునేది అంటున్నారు.